Krishna | సూపర్‌స్టార్ కృష్ణ.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఎవర్గ్రీన్…నటనలో, సాహసాల్లో, ప్రయోగాల్లో కృష్ణ స్థానం పదిలం. మూడొందలకు పైగా చిత్రాల్లో హీరోగా నటించిన ఘనత ఆయనది. ఆయన స్వర్గస్తులైన.. ఆయన సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల్లో గుండెల్లో చెరగని ముద్రను సంపాందించుకున్నాయి. అయితే కృష్ణ కెరీర్లో ఓ మరపురాని చిత్రంగా నిలిచిన వాటిలో అల్లూరి సీతారామారాజు ఒకటి. ఆ సినిమా గురించి, ఆ సినిమా చిత్రీకరణ విశేషాల గురించి ఈ ఘట్టమనేని సూపర్‌స్టార్ ఓ సారి పంచుకున్నారు.
” అప్పట్లో అల్లూరి సీతారామారాజు అనేది ఒక సాహసం. ఓ రోజు నిర్మాత డీఎల్ నారాయణ నా చేతికి అల్లూరి సీతారామారాజు కథ ఇచ్చి ఇందులో నువ్వు నటిస్తే బాగుంటుంది అన్నారు. అంతకు ముందు అసాధ్యుడులో ఆ గెటప్ వేసిన అనుభవం వుంది. అయినా చేయగలననే కాన్ఫిడెన్స్ వుంది. సరేనన్నాను. ప్రముఖ రచయిత మహారథి నెలలోపే స్క్రిప్ట్‌ను తయారుచేశాడు. అయితే ఈ సినిమాలో ఫైట్లు లేవు, గ్లామర్ లేదు. ఒకే డ్రెస్సు, చిత్రీకరణ అంతా అడవిలోనే..ఇలా పలు కారణాలతో పంపిణీదారులు ఎవరూ ముందుకు రాలేదు.
ముందుగా ఈ పాత్రను ఎన్టీఆర్ చేయాలనుకున్నాడని తెలిసి ఆయన్ని అడిగాను. మీరు చేస్తానంటే నేను ఆగిపోతానని చెప్పాను. కానీ జవాబు రాలేదు. దాంతో షూటింగ్ మొదలుపెట్టాం. చింతపల్లి, రంపచోడవరం అడవుల్లో నెలల తరబడి చిత్రీకరణ చేశాం. షూటింగ్లో చాలా ఆటంకాలు వచ్చాయి. అయినా చిత్రీకరణ ఆగలేదు. ఈ సమయంలోనే దర్శకుడు రామచంద్రరావు అనారోగ్యం పాలయ్యారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. దాంతో ఆ చిత్రానికి నేను ఘొస్ట్ దర్శకుడినయ్యాను. ఫైట్స్ మాత్ర కేఎస్ఆర్ దాస్ చేశారు.ఫస్ట్‌కాపీ చూసిన బయ్యర్స్ ఏమీ మాట్లాడలేదు. ఆ సినిమా చూసిన చక్రపాణి మాత్రం ఈ సినిమా తరువాత నీ సినిమాలన్నీ ఇబ్బందుల్లో పడ్డట్టే అన్నారు. ఎందుకంటే ఇంత గొప్ప పాత్రలో చూసిన నిన్ను చూసిన ప్రేక్షకులు ఇంకో పాత్రలో అంగీకరించడానికి రెండేళ్లయినా పడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నాకు ఆ ఏడాది పదమూడు అపజయాలు వచ్చాయి. మరుసటి ఏడాది కూడా వరుస ఫ్లాప్లే.. దేవదాసు చిత్రం కూడా ఈ ప్రవాహంలోనే కొట్టుకపోయింది. ఈ సమయంలోనే పాడిపంటలు చిత్రం నా ఫ్లాప్‌ల పరంపరకు బ్రేక్ వేసింది’ అని చెప్పుకొచ్చారు కృష్ణ.