మా బాబు వయసు ఐదు సంవత్సరాలు. బక్కగా ఉంటాడు. అసలు భోజనం చేయడు. బడికి పోతున్నాడు. చదువులో బాగానే ఉన్నాడు. బాగానే ఆడుకుంటాడు. సాయంకాలం కాగానే కొంచెం నీరసంగా ఉంటాడు. డాక్టర్‌కు ఎన్నిసార్లు చూపించినా ఏ ఇబ్బందీ లేదన్నారు. మా బాబు పుట్టడానికి రెండేళ్ల ముందు మా నాన్న టీబీతో చనిపోయారు. సాయంకాలం నీరసంగా ఉండటం, బక్కగా ఉండటం టీబీ లక్షణాలు కాబట్టి ఆరోగం అంటుకుందేమోనని భయంగా ఉంది. మా సందేహం నిజమేనా?
బక్కగా, నీరసంగా ఉండటం, ఏ పనీ చేయకపోవడం, సాయంకాలం జ్వరం, దగ్గు (లంగ్స్ టీబీ) ఇవన్నీ టీబీ లక్షణాలు. వయసుకు తగిన బరువు ఉంటే కంగారు పడకండి. బాబుకు వ్యాక్సిన్ ఇచ్చారా? లేదా? చెప్పలేదు. మీ నాన్న ప్రభావం మీ బాబుపై ఉండదు. ఇప్పుడెవరైనా ఇంట్లో టీబీతో బాధపడుతున్నదీ లేనిదీ చెప్పలేదు. ఒకవేళ టీబీ ఉన్నవాళ్లు ఉంటే డాక్టర్‌ను సంప్రదిస్తే.. కొన్ని పరీక్షలు చేయిస్తారు. జ్వరం, దగ్గు, కడుపునొప్పి (పొట్టకు సంబంధించిన టీబీ అయితే), కడుపు ఉబ్బరం, గ్రంథుల వాపు వంటి సమస్యలు ఉంటాయి. క్రమం తప్పకుండా బరువు పెరగడం, హుషారుగా ఉంటే టీబీ కాకపోవచ్చు. మీరు చెప్పినదాన్ని బట్టి మీ బాబుకు టీబీ లేదనిపిస్తున్నది. పిల్లల వైద్యుల్ని కలిసి, మీ అనుమానాలు చెబితే పరీక్షలు చేసి మీ సందేహాన్ని తీరుస్తారు.