బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టాప్-4లో సుస్థిర చోటే లక్ష్యంగా దూసుకెళుతున్న హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) వరుస విజయాల జోరు కొనసాగించేందుకు తహతహలాడుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ తమదైన జోరు కనబరుస్తున్న హెచ్ఎఫ్సీ..ఎస్సీ ఈస్ట్బెంగాల్తో గురువారం తలపడనుంది. బాంబోలిమ్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో హెచ్ఎఫ్సీ ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. ఎఫ్సీ గోవాతో జరిగిన గత మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకున్న హైదరాబాద్..నిలకడలేమితో సతమతమవుతున్న ఈస్ట్బెంగాల్ను ఓడించాలన్న కసితో కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో మూడు విజయాలు, రెండు డ్రాలు, ఒక ఓటమితో 11 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హెచ్ఎఫ్సీ మూడో స్థానంలో కొనసాగుతున్నది.
మరోవైపు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు ఓటములు, మూడు డ్రాలతో మూడు పాయింట్లతో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరువని ఈస్ట్ బెంగాల్ ఆఖరి స్థానంలో ఉంది. తమదైన దూకుడు కొనసాగించేందుకు హెచ్ఎఫ్సీ పక్కా ప్రణాళికను ఎంచుకుంటే..ఎలాగైనా బోణీ కొట్టాలన్న పట్టుదల ఈస్ట్ బెంగాల్ జట్టులో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.