KTR | నాడు కాంగ్రెస్ పాలనలో 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన పరిస్థితుల్లో, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సహకరించక పోయినా రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ పట్ల అద్భుతమైన విజయంతో అనేక ప్రణాళికలను గత ప్రభుత్వం రూపొందించిందన్నారు. రేవంత్ రెడ్డి మాదిరి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలన్న మాదిరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదు అన్నారు. కేవలం ప్రజల ప్రయోజనాలు సౌకర్యం కోసమే దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను 6 కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆరేనని, నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే, వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజల్ని అవమానిస్తారా..? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఫేజ్-2ను అటకెక్కించడం మీ వైఫల్యమని, అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహం మీదేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎల్అండ్ టీపై బెదిరింపులు..
మెట్రో ఫేజ్-2కు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్లుగా భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా అని ఆయన ఆరోపించారు.
రూ. 30 వేల కోట్ల మెట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం కాసుల కక్కుర్తి కోసం హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తును రేవంత్ రెడ్డి పణంగా పెడుతున్నారన్నారు.