HCA | న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అవినీతి వ్యవహారం మరోమారు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. హెచ్‌సీఏలో భారీ మొత్తంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత హెచ్‌సీఏ పాలకవర్గ సభ్యులు చేసిన భారీ అవినీతి బట్టబయలైంది. మార్కెట్ ధరకు మించి పలు కంపెనీలు సాగించిన ఈ అవినీతి దందాతో హెచ్‌సీఏను మరోమారు కుదుపునకు లోను చేసింది. ఈ వ్యవహారంలో హెచ్‌సీఏ మాజీ ఉపాధ్యక్షుడు, కోశాధికారి సురేందర్ అగర్వాల్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. క్విడ్‌ప్రొకో జరిగిన ఇందులో మొత్తం 90 లక్షల అవినీతి జరిగినట్లు గుర్తించిన ఈడీ.. రూ.51.29 లక్షల ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) అటాచ్ చేసినట్లు తెలిపింది. మొత్తంగా లక్షలు రూపాయలు చేతులు మారిన ఈ అవినీతి దందాలో ఈడీ పలు సంచలనాల విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. ప్లేయర్లు, స్టేడియం కోసం బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాల కోసం సారా స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్, బాడీ డ్రెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు హెచ్‌సీఏ కాంట్రాక్టులు అప్పగించింది.
అయితే మార్కెట్ ధరకు మించి అధిక మొత్తానికి కోట్ చేసిన ఈ కంపెనీలు క్విడ్‌ప్రొకో కింద సురేందర్ అగర్వాల్‌కు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పినట్లు విచారణలో తేలింది. ఇందులో సురేందర్ అగర్వాల్ కుటుంబానికి రూ.90.86 లక్షల లబ్ధి చేకూరినట్లు ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి. సురేందర్ భార్యకు చెందిన కేబీ జువెల్లర్స్‌కు సారా స్పోర్ట్స్ 17 లక్షలు జమా చేయగా, కొడుకు అక్షిత్ అగర్వాల్‌కు మ్యూజిక్ షో, ఈవెంట్ మేనేజ్మెంట్ కింద డబ్బులు అందాయి. బకెట్ కుర్చీల కొనుగోలు కింద ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్..అక్షిత్ అగర్వాల్ అకౌంట్‌తో పాటు వజ్రాలు కొన్నందుకు కేబీ జువెల్లర్స్‌కు రూ.21.86 లక్షలు ముట్టజెప్పాయి. అంతటితో ఆగకుండా సురేందర్‌తో పాటు అతని కోడలు వ్యక్తిగత అకౌంట్లకు తోడు కేబీ జువెల్లర్స్‌కు జిమ్ పరికరాల సరఫరా కంపెనీ బాడీ డ్రెంచ్ ఇండియా రూ.52 లక్షలు ఇచ్చినట్లు విచారణలో తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే 20 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ విచారణ కొనసాగించింది. ఈ వ్యవహారంలో హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లతో పాటు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.