హైదరాబాద్/శేరిలింగంపల్లి, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రాథమిక పాఠశాలల్లోని 30 వేల మందికిపైగా విద్యార్థులకు రియల్‌పేజ్ ఇండియా సంస్థ షూస్‌ను విరాళంగా అందించింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమలకు సాఫ్ట్వేర్, డాటా ఎనలిటిక్స్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమంలో భాగంగా ‘రియల్ సోల్స్ ఫ్రమ్ రియల్ సోల్స్’ పేరిట షూలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అథ్లెటిక్ ట్రాక్‌పై 30,107 జతల షూస్‌ను 6.188 కిలోమీటర్ల వరుసక్రమంలో అమర్చి ‘లాంగెస్ట్ లైన్ ఆఫ్ షూస్’ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దీంతో 2011లో అమెరికాలో 24,962 షూస్‌తో నమోదైన రికార్డు బద్ధలైనట్టు గిన్నిస్ వరల్డ్ రికార్ట్ ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదవారికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన రియల్‌పేజ్ సంస్థకు, ఐటీ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. రియల్‌పేజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్‌శర్మ మాట్లాడుతూ.. తెలంగాణలో రియల్ హీరోలను చూశానని, వారిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రథములని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ఐటీ, పరిశ్రమల శాఖ జయేశ్‌రంజన్‌తోపాటు తమకు రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కూడా హీరోలుగా అభివర్ణించారు.