నగరానికి మంచి నీటి ముప్పు ముంచుకొస్తున్నది. రాబోయే నెలరోజుల పాటు వర్షాలు కురవకుంటే.. నీటి కటకట తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి జలప్రదాయిని అయిన సింగూరులో జలమట్టం గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే బోర్లు ఎండిపోయి, జలమండలి నీళ్లు సరిపోక బస్తీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానలు పడకపోతే జలమండలి పరిధిలోని నివాసాలకు నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.
నాగార్జున సాగర్, ఎల్లంపల్లిలో డెడ్ స్టోరేజీలను సైతం వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. నగరానికి నీటిని సరఫరా చేసే అన్ని జలాశయాలు కలిపి 80 రోజుల పాటు సరఫరా చేసే సామర్థ్యం కలిగిన నీళ్లే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే మిషన్ భగీరథ నుంచి భారీ మొత్తంలో నీటిని సేకరించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి.
– సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ)
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మంచినీటి సమస్య ముంచుకొస్తున్నది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా పడకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయి. అప్పుడప్పుడు పడిపోతున్న మోస్తరు వర్షాలకు నగరానికి అందాల్సిన నీళ్లు అక్కడిక్కడికి సరిపోయేలా సరఫరా అవుతున్నాయి. కానీ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల రాబోయే నెలరోజుల పాటు వర్షాలు కురకుంటే నగరానికి మంచినీటి కరువు ముప్పు పొంచిఉన్నది.
ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు ఎండిపోయి, జలమండలి నీళ్లు సరిపోక బస్తీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా సరిగ్గా లేని ప్రాంతాల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్యాంకర్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. ఈనేపథ్యంలో నగరానికి నీటిని సరఫరా చేసే అన్ని జలాశయాలు కలిపి 80 రోజుల పాటు సరఫరా చేసే సామర్థ్యం కలిగిన నీళ్లు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో జలమండలి అధికారులు నగరానికి నీటి సమస్యను తగ్గించేందుకు మిషన్ భగీరథ నుంచి మళ్లించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే మిషన్ భగీరథ నుంచి భారీ మొత్తంలో నీటిని సేకరించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి.
వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే నగరానికి నీటి కటకట తప్పేలా లేదు. గ్రేటర్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలతో పాటు జలమండలి పరిధిలోని నివాసాలకు నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లిలో డెడ్ స్టోరేజీలను సైతం వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారీ వర్షాలు కురువకపోతే ఎమర్జెన్సీ పంపింగ్ తప్పనిసరిగా మారనుంది. డిసెంబర్ చివరినాటికి నగరానికి నీళ్లందించడం అత్యంత కష్టతరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భూగర్భ జలాలు సైతం వేగంగా పడిపోతున్నాయి.