ఉప్పల్, మార్చి 10: ఒకప్పుడు నిత్యం రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉండే ఉప్పల్ జంక్షన్ ముఖ చిత్రమే ప్రస్తుతం మారిపోనుంది. ట్రాఫిక్ చిక్కుముళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈ కూడలి మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ల సమాహారంగా కనబడనుంది. కించిత్తు ఆటంకం లేకుండా నలువైపులా వాహనాలు సాఫీగా వెళ్లనున్నాయి. ఈ మేరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్సార్డీపీ) రెండో దశలో భాగంగా రూ.450 కోట్లతో చేపట్టనున్న ఫ్లైఓవర్ల నిర్మాణ పనులకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఇప్పటికే మెట్రో రైలు, స్కైవాక్, ఎలివేటెడ్ కారిడార్, సమీపంలోనే శిల్పారామం, థీమ్ పార్కు, ఐటీ పార్కు, క్రికెట్ స్టేడియంతో ప్రాంతం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తాజా నిర్మాణంతో ఉప్పల్‌కు ప్రాధాన్యత మరింత పెరగనుంది. ముఖ్యంగా వరంగల్ వైపు రాకపోకలు సాగించే వారికి ఇది భారీ ఊరట కలిగించనుంది.
శంకుస్థాపనలు – ప్రారంభోత్సవాలు
మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటనలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు మల్లాపురంలో రూ.4 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 9.30 గంటలకు నాచారంలోని పెద్ద చెరువు వద్ద 17.50 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ.411 కోట్ల అంచనా విలువతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం, పది గంటలకు రూ.450 కోట్లతో చేపట్టే ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.15 గంటలకు ఉప్పల్ జంక్షన్‌లోనే రూ.2.20 కోట్లతో నిర్మించిన థీమ్ పార్కును ప్రారంభించనున్నారు. ఆపై పదిన్నర గంటలకు రామంతాపూర్‌లో వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా రూ.10.32 కోట్లతో చేపట్టే పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఉప్పల్‌లో మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించనున్న మీదట ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పరిశీలించారు. జోనల్ కమిషనర్ పంకజ, డీసీలు, సీఐలు, ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ప్రాంతాలను, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న ప్రదేశాలను సందర్శించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లతోనే అభివృద్ధి
ఉప్పల్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి సాధిస్తుంది. గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కారమవుతున్నాయి. ఉప్పల్ రింగ్‌రోడ్డు ఒక రోల్ మోడల్‌గా నిలువనుంది. మంత్రి కేటీఆర్‌కు ఉప్పల్ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు. వరద నీటి సమస్యలు, చెరువుల సుందరీకరణ, ఐటీ పార్కుల రాకతో ఉప్పల్ ప్రాంతానికి గుర్తింపు లభించింది. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషిచేస్తాం.
– బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉప్పల్ నియోజకవర్గం