ఖైరతాబాద్, మార్చి 10: జీవనశైలిలో మార్పులు.. ఆరోగ్యకరమైన ఆహారంతోనే కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ అన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గురువారం నిమ్స్ దవాఖానలోని ఆడిటోరియంలో కిడ్నీ మార్పిడి చేసుకొని.. ఆరోగ్యవంతంగా జీవిస్తున్న వారితో కలిసి ఏర్పాటు చేసిన వేడుకలను డీన్ రామ్మూర్తి, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గంగాధర్, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, జీవన్‌దాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులున్న వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని మనోహర్ అన్నారు. డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ డయాలసిస్ రోగుల కోసం ప్రతి ఏడాది రూ.100 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. డాక్టర్ శ్రీభూషణ్ రాజు మాట్లాడుతూ నిమ్స్‌లో 100కు పైగా రోగులకు నిత్యం డయాలసిస్ జరుగుతున్నట్లు వెల్లడించారు.
మానసిక ైస్థెర్యం ఉంటే చాలు
నిమ్స్ నెఫ్రాలజీ విభాగంలో పనిచేస్తున్నా. పది సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. గతేడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా. జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అవకాశం లభించింది. 2021 జూన్ 2న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా.
-ఎ. జయలక్ష్మి, , నిమ్స్ నెఫ్రాలజీ విభాగం
శ్రీభూషణ్ సార్ ధైర్యం చెప్పారు
మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామం. వ్యాపారం చేస్తాను. పదేండ్ల కిందట నా కిడ్నీలు పాడయ్యాయి. నిమ్స్ దవాఖానకు వస్తే నెఫ్రాలజీ విభాగం వైద్యులు డాక్టర్ శ్రీభూషణ్ రాజు ఎంతో ధైర్యం చెప్పారు. మా అమ్మ అమృతమ్మ తన కిడ్నీని దానం చేశారు. 2010 జూన్ 6లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స డాక్టర్ శ్రీభూషణ్ రాజు నేతృత్వంలో జరిగింది. ఇప్పుడు నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.
-జి. హర్షవర్ధన్‌రెడ్డి
ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా
మాది పాత వరంగల్ జిల్లా హన్మకొండ. 2017లో కిడ్నీ సమస్య వచ్చింది. బీటెక్ చదువు పూర్తయింది. అనారోగ్యం కారణంగా ఉద్యోగం పొందలేకపోయాను. అప్పటి నుంచి డయాలసిస్ చేశారు. జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకున్నా. అదృష్టం బాగుండి నా బ్లడ్గ్రూప్నకు మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరికింది. జీవన్‌దాన్ ఇన్చార్జి స్వర్ణలత మేడమ్ చాలా సహకరించారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా. -డి. రాఘవ