సుల్తాన్‌బజార్, మార్చి 10: కిడ్నీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. దవాఖాన ఆడిటోరియంలో నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషా సహాయ్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ నాగేందర్ కిడ్నీల ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, సివిల్ సర్జన్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, యురాలజీ విభాగాధిపతి మల్లికార్జున్, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంవో సాయిశోభ తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా నాకు పునర్జన్మనిచ్చింది
తల్లి జన్మనిస్తే ఉస్మానియా దవాఖాన నాకు పునర్జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. జీవితంపై ఆశలు వదులుకున్న సమయంలో ఉస్మానియా దవాఖానలో చేరా. నా తల్లి నర్సమ్మ కిడ్నీ దానం చేయడంతో 2014 మే 5న నెఫ్రాలజీ విభాగం వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా.. వివాహం చేసుకున్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
-సాయిలు సిద్దాపురం,నల్లగొండ
నిరుపేదలకు వరం
నిరు పేదలకు ఎంతో భరోసాతో పాటు ఆసరా ఇస్తున్న ఘనత ఉస్మానియా దవాఖానకే దక్కుతుంది. కిడ్నీ వ్యాధి అనగానే తమ జీవితం అయిపోయిందనే భావించే వారు కంగారు పడకుండా ఉస్మానియా నెఫ్రాలజీ వైద్యులను కలిస్తే పునర్జన్మ లభిస్తుంది. నా భార్య స్పందన కిడ్నీని ఇచ్చి నాకు పునర్జన్మ ఇచ్చింది. నిరుపేదలకు ఉస్మానియా దవాఖాన వరంలాంటిది.
-అశోక్
ఉస్మానియా వైద్యులు దేవుళ్లు..
నా కుమారుడు కిడ్నీ వ్యాధి బారినపడ్డాడని తెలియగానే ఎంతగానో భయపడ్డాను. స్థానిక దవాఖానలకు వెళితే.. లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పగానే.. కొడుకును ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించాను. ఆ సమయంలో ఉస్మానియా దవాఖాన వైద్యులు ఇచ్చిన భరోసాను ఎప్పటికీ మరిచిపోలేను. నా కిడ్నీని దానం చేయడంతో నా కుమారుడికి అమర్చారు. వాడిని ఆరోగ్యంగా జీవించేలా చేసిన ఉస్మానియా వైద్యులు దేవుళ్లు.
– నర్సమ్మ, నల్లగొండ
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా
నా భర్తకు కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడని తెలియగానే భయమేసింది. ఉస్మానియా వైద్యులు ఇచ్చిన సూచనలతో నా కిడ్నీని ఇచ్చా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నా భర్తకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషాసహాయ్ మేలును ఎప్పటికీ మరిచిపోలేను.
-స్పందన