బడంగ్‌పేట, మార్చి 5 : రాష్ట్రంలో ఆడపడుచులకు మేనమామలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బడంగ్‌పేట పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్హాల్లో నియోజకవర్గ మహిళా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు అందించి మహిళల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. మహిళల భద్రతకు షీ టీమ్స్, పోలీస్‌శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పారు. బాలికలకు ప్రత్యేకంగా గురుకులాలు, 53 మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా దినోత్సవ కార్యక్రమాలు మూడు రోజులు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీ కట్టడం, మహిళలను సన్మానించాలని పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పొందిన కుటుంబాలను కలిసి సెల్ఫీలు దిగాలన్నారు. అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కి మహిళల అందరి తరఫున కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, కార్పొరేటర్లు లావణ్య, మాజీ కార్పొరేటర్ బండి మీనా, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా బంధు రాఖీలు సిద్ధం
‘మహిళా బంధు – కేసీఆర్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కట్టే రాఖీలను మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు సిద్ధం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి రాఖీలు కట్టిన అనంతరం పారిశుధ్య కార్మికులు, ఆశావర్కర్లు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను సన్మానించనున్నారు.
మహిళా బంధును విజయవంతం చేస్తాం
‘మహిళా బంధు కేసీఆర్’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. నేటి నుంచి మూడు రోజులు పాటు మహిళ దినోత్సవం సందర్భంగా సంబురాలను నిర్వహిస్తాం. నియోజకర్గంలోని ప్రతి డివిజన్‌లోనూ మహిళా కార్పొరేటర్లే ఉన్నారని, ఈ క్రమంలో ఆయా డివిజన్లలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాం.
– తీగుళ్ల పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్
అదే స్ఫూర్తి కొనసాగించాలి
గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతోపాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. అదే స్ఫూర్తితో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంబురాలను విజయవంతం చేయాలి.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెండ్లితోపాటు వృద్ధురాలు అయ్యే వరకూ ప్రభుత్వమే బాధ్యత వహించేలా సీఎం కేసీఆర్ పథకాలు రూపకల్పన చేశారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గురుకులాలు, ఆసరా పింఛన్లు దేశంలోనే స్ఫూర్తిదాయకమైనవి. ఆయనకే మహిళలందరి మద్దతు. మహిళల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ
మహిళలు సంతోషంగా పాల్గొనాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆడబిడ్డల సంక్షేమానికి, రక్షణకు పెద్దపీట వేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మూడురోజుల పాటు జరిగే సంబురాల్లో మహిళలందరూ సంతోషంగా పాల్గొనాలి.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్జి,మల్కాజిగిరి పార్లమెంట్