సికింద్రాబాద్, మార్చి 3 : రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ బోర్డు మాజీ సభ్యులతో పార్టీ బలోపేతంపై చర్చించారు. కంటోన్మెంట్‌లోని ఎనిమిది వార్డుల్లో పార్టీని పటిష్టం చేసేందుకు బోర్డు మాజీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. కేంద్రం పట్టించుకోకున్నా ఈ ప్రాంతంలో ఉచిత తాగునీటి పథకం అమలుతో పాటు ప్యాట్నీ నాలా అధునీకీకరణ, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
బోర్డు మాజీ సభ్యులు, కీలక నేతలు వార్డుల్లోని బస్తీల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమవ్వాలని దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో బోర్డు మాజీ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నాగేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, ప్రభాకర్, నేతలు నివేదిత, నర్సింహ పాల్గొన్నారు.