ఉస్మానియా యూనివర్సిటీ ,మార్చి 3: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (జీవోపీఏ) ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో జీవోపీఏ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్‌గౌడ్ కీలక పాత్ర పోషించారని, ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడారని గుర్తు చేశారు. ప్రజాసేవలో ఉంటూ, ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని, దీంతో తమ రాజకీయ ఎదుగుదలకు ఇబ్బంది అని భావించిన కొందరు నాయకులు ఆయన హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. మంత్రికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జీవోపీఏ అధ్యక్షుడు మద్దెల రమేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సాయన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.