బంజారాహిల్స్,ఫిబ్రవరి 23: ఖైరతాబాద్ నియోజకవర్గంలో మురుగు సమస్యల పరిష్కారం కోసం రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. నియోజకవర్గంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ. ఖైరతాబాద్. హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జలమండలి డివిజన్ -6 జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సెక్షన్ వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీహరి, తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబు, ఫిలింనగర్ సెక్షన్ మేనేజర్ పవన్, బంజారాహిల్స్ సెక్షన్ మేనేజర్ మేనేజర్ శివ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో డివిజన్ల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఖైరతాబాద్ డివిజన్‌కు రూ.1.65 కోట్లు, వెంకటేశ్వరకాలనీ డివిజన్‌కు రూ.1.20కోట్లు, బంజారాహిల్స్ డివిజన్‌కు రూ.1.27కోట్లు, జూబ్లీహిల్స్ డివిజన్‌కు రూ.1.30 కోట్లు, సోమాజిగూడ డివిజన్‌కు రూ.2.1కోట్లు, హిమాయత్‌నగర్ డివిజన్‌కు రూ.60లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.
సీవరేజీ సమస్యలతో పాటు మంచినీటి సరఫరాలో లోపాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మ్యాన్ హోల్స్ పొంగకుండా ఎక్కడెక్కడ కొత్త లైన్లు అవసరమో గుర్తించి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఫిలింనగర్ బస్తీల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఖైరతాబాద్ డివిజన్ బీజేఆర్‌నగర్‌లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కలింగభవన్ నుంచి తట్టిఖానా సెక్షన్ పైపులైన్ పనులు ప్రారంభించాలి
ప్రశాసన్‌నగర్ నుంచి తట్టిఖానా సెక్షన్ దాకా గ్రావిటీతో మంచినీటిని తరలించేందుకు చేపట్టిన పైపులైన్ పనుల్లో మిగిలిపోయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను కోరారు. మూడేళ్లక్రితమే ఈ ప్రాజెక్టులో 70శాతం పనులు పూర్తయ్యాయని, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 దాకా పైపులైన్ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. కలింగభవన్ చౌరస్తానుంచి తట్టిఖానా సెక్షన్ దాకా పైపులైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఈ పనులు పూర్తయితే తట్టిఖానా సెక్షన్‌కు గ్రావిటీ ద్వారా ప్రశాసన్‌నగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా తట్టిఖానా సెక్షన్ పరిధిలోకి వచ్చే నందినగర్, వెంకటేశ్వరనగర్, ఇందిరానగర్, జవహర్‌నగర్ తదితర బస్తీల్లో మంచినీటి సమస్యలు పూర్తిగా తీరుతాయన్నారు.