రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు విజయవాడ జాతీయ రహదారిపై దిష్టిబొమ్మను దహనం చేసి.. నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. వందలాది మంది అమరుల త్యాగాలను అవమానపరిచిన మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో తెలంగాణ రాష్ట్ర సమితి లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పులిగారి గోవర్థన్‌రెడ్డి, కొంతం గోవర్థన్‌రెడ్డి, రవికుమార్, రవీందర్, అరవింద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే..
ప్రత్యేక రాష్ట్ర బిల్లు అశాస్త్రీయమంటూ ప్రధాని మాట్లాడటం శోచనీయం. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోదీ అవకాశం దొరికినప్పుడల్లా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను తక్కువ చేసేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటు. తెలుగు రాష్ర్టాల మధ్య శాంతియుత వాతావరణం చెడగొట్టేందుకు బీజేపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. తెలంగాణపై కక్ష పెంచుకున్న ప్రధాని అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది.
– ఎంఎన్ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ గ్రేటర్ నేత
తెలంగాణపై ద్వంద్వ వైఖరి తగదు..
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. వివక్ష చూపుతూ నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నది. రాష్ట్ర విభజనపై పార్లమెంట్లో మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణపై విషం కక్కడం ప్రధాని మోదీకి పరిపాటిగా మారింది. విభజన హామీలను వెంటనే అమలు చేయాలి. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని వెంటనే ఉపసంహరించుకొని క్షణమాపణలు చెప్పాలి.
– వెంకటరాజేశ్వర్‌రావు,లోక్‌దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు