సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పై యుద్ధం ప్రకటించడంతో పోలీసులు అందరినీ భాగస్వాములను చేస్తూ.. వాటిని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి, సమాజానికి కీడు చేసే మత్తును శాశ్వతంగా పారద్రోలేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ నేరేడ్మెట్లోని కార్యాలయంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నివారణకు తీసుకోవాల్సిన, పాటించాల్సిన అంశాలను వారికి వివరించారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను వాడుతున్నట్లు, విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ 9490617111 సమాచారం అందించాలని సీపీ కోరారు.
ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, క్రైం డీసీపీ యాదగిరి, మాల్కాజిగిరి, సరూర్‌నగర్ ఎక్సైజ్ ఎస్పీలు అరుణ్‌కుమార్, రవీందర్రావు, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు, తదితర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
“నా ప్రతిజ్ఞ”
‘నేను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంటా..
వాటి నుంచి నన్ను నేను కాపాడుకుంటా..
మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను అందరికీ తెలియపరుస్తా.
నేను నా కుటుంబం మరియు కాలనీ, వార్డు, గ్రామ, పట్టణ పరిధిలో పూర్తిగా మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు శాయశక్తులా కృషి చేస్తా.
మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు నాకు తెలిస్తే.. వెంటనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందిస్తా..
మాదకద్రవ్యాల నిర్మూలనకు తోడ్పడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం..’
అని.. మంగళవారం రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.