సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఫేస్బుక్లో ప్రేమతో పలుకరించారు నైజీరియన్ సైబర్‌నేరగాళ్లు. ప్రేమకు గుర్తుగా నీకు బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించారు. మహేశ్ బ్యాంక్ సైబర్ దోపిడీ డబ్బులను ఆమె ఖాతాలోకి బదిలీ చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి.
గత నెల 22వ తేదీన మహేశ్ బ్యాంక్ సర్వర్‌పై అటాక్ చేసిన సైబర్‌నేరగాళ్లు అందులో నుంచి రూ.12.93 కోట్లు కాజేశారు. ముందుగా మహేశ్ బ్యాంక్‌లోని పలు ఖాతాలను ఎంచుకున్నారు. ఆ ఖాతాలలోకి నగదును బదిలీ చేసి, అందులో నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 128 ఖాతాల్లోకి బదిలీ చేశారు. ప్రాక్సీ సర్వర్‌తో మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహకారంతో కూకట్పల్లి, గాంధీనగర్, మాదాపూర్‌లలోని మహేశ్ బ్యాంక్‌లలో ప్రీ వైఫైని ఉపయోగించి ఖాతాలను తెరిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హ్యాకింగ్ చేసిన డబ్బు హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యింది. ఆయా ఖాతాలు ఎవరివి, వారికి ఆ డబ్బు ఎలా వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుతో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు.
ఎఫ్బీ ఫ్రెండ్ షిప్‌తో..
యువతికి ఫేస్బుక్లో ఓ గుర్తుతెలియని విదేశీయుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. పెండ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి గుడ్డిగా నమ్మింది. ప్రేమగా నీకు గిఫ్ట్ పంపించాలని ఉందని, ఇప్పుడు నేను భారత్‌కు వచ్చే పరిస్థితుల్లో లేనంటూ చెప్పుకొచ్చాడు. అయితే నీవు బ్యాంకు ఖాతా తెరిచి ఇవ్వు, నేను అందులో నీవు ఉహించని విధంగా గిఫ్ట్‌ను బహూకరిస్తానంటూ నమ్మించాడు. దీంతో ఆమె తన బంధువు సహకారంతో బ్యాంకు ఖాతాను తెరిచి, ఆ ఖాతా వివరాలు అందజేసింది. ఈ ఖాతాలోకి సైబర్ దోపిడీకి సంబంధించిన డబ్బును బదిలీ చేసి, తిరిగి నేరగాళ్లు వాటిని తీసేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు, బ్యాంకు ఖాతాలు తెరవడం, వారికి అన్ని వివరాలు అప్పగించడం చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
గిఫ్ట్ పంపిస్తానంటే ఖాతా తెరిచా..!
బెంగళూర్‌లో ఇద్దరు నైజీరియన్లను, ఢిల్లీలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తులో అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బేగంపేటకు చెందిన ఓ యువతి ఖాతాలోకి కూడా డబ్బు బదిలీ అయ్యింది. అక్కడి నుంచి మరో ఖాతాలోకి వెళ్లిన విషయాన్ని గుర్తించారు. యువతి ఖాతా చిరునామా బేగంపేటలో ఉండటంతో పోలీసులు వెళ్లి ఆరా తీయగా.. తనకేమి తెలియదని తనకు గిఫ్ట్‌గా నగదు పంపిస్తానంటే తాను బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చానంటూ చెప్పింది.