ఎల్బీనగర్, జూన్ 10: విఘ్నాలకు అధిపతి వినాయకుడి విగ్రహాలను మట్టివే ప్రతిష్ఠించేలా మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) చర్యలు ప్రారంభించింది. ఓ వైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే మట్టి విగ్రహాల తయారీని ఈ ఏడాది భారీగా పెంచాలని సంకల్పించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎల్బీనగర్ సర్కిల్ లింగోజిగూడ డివిజన్లో కుమ్మరులు, స్థానిక పొదుపు సంఘాల మహిళలకు మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ ప్రారంభమైంది. ఈ విగ్రహాల తయారీ నిపుణుడు హన్మంతరావు ఆధ్వర్యంలో ఎలా తయారు చేయాలో మెళకువలు నేర్పించారు. త్వరలో సర్కిల్‌కు రెండుచోట్ల నమూనా మట్టి విగ్రహాలను పెట్టడంతోపాటు మట్టి ప్రతిమలు లభించే వివరాలను అందుబాటులో ఉంచనున్నారు.
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి పలుకుతూ మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పూజించేలా జీహెచ్ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సర్కిళ్ల వారీగా కుమ్మరులు, మహిళా పొదుపు సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చి మట్టి గణనాథులను తయారు చేయించే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ జోన్‌లోని మూడు సర్కిళ్ల అధికారులు శిక్షణకు శ్రీకారం చుట్టారు. ప్రప్రథమంగా ఎల్బీనగర్ సర్కిల్ జోనల్ కమిషనర్ పంకజ ఆధ్వర్యంలో ఉప కమిషనర్ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో లింగోజిగూడ డివిజన్లోని జానకీ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం మట్టి గణపతుల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పర్యావరణ హితం..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణ, నీటి కాలుష్యం పెరుగుతున్నందున వీటిని నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలపై సుప్రీంకోర్టు సైతం ఆంక్షలు విధించిన నేపథ్యంలో మట్టి వినాయక విగ్రహాల వైపు ప్రతిఒక్కరూ మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మట్టి గణపతుల తయారీ నిపుణుడు హన్మంతరావుతో తయారీ శిక్షణ శిబిరాలను చేపట్టింది. అంతేకాక ప్రతి సర్కిల్లో నమూనా మట్టి విగ్రహాలను పెట్టి అవి దొరికే ప్రాంతాలను అక్కడ పొందుపరచనున్నారు. మరోవైపు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఎల్బీనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్ ఉప కమిషనర్లు సురేందర్‌రెడ్డి, మారుతీ దివాకర్, హరికృష్ణయ్యలు మట్టి గణపతులను తయారు చేసే నిపుణుల వద్దకు వెళ్లి స్థానికంగా శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
లింగోజిగూడెంలో ప్రథమంగా..
మట్టి వినాయకుల తయారీకి ప్రథమంగా ఎల్బీనగర్ సర్కిల్ లింగోజిగూడ డివిజన్లోని జానకీ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్ వేదికైంది. మట్టి గణనాథుల తయారీ నిపుణుడు హన్మంతరావు బృందం స్థానిక కుమ్మరులతో పాటుగా మహిళా సంఘాల సభ్యులకు మట్టి వినాయకుల తయారీపై శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్లు సురేందర్‌రెడ్డి, మారుతీ దివాకర్, హరి కృష్ణయ్య, జోనల్ ఎస్ఈ అశోక్‌రెడ్డి, డిప్యూటీ ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.