“సమాజంలో అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దళితబంధు పథకం ఓ చారిత్రక నిర్ణయం. ఈ పథకం అమలుతో సామాజిక మార్పు తథ్యం. దూరదృష్టితో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమాపథకాలను ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారో.. మరోసారి దేశమంతా తెలంగాణ వైపు చూసేలా దళితబంధు ఉండబోతున్నది. దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నది. ఈ పథకంతో రానున్న రోజుల్లో దళితులు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం ఖాయం. అంతేకాకుండా దళితులు సమాజంలో గౌరవప్రదంగా బతకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం”అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు అమలుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ‘నమస్తే తెలంగాణ’ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..
నమస్తే తెలంగాణ: దళితబంధు పథకం ముఖ్య ఉద్దేశం?
మంత్రి సబితా ఇంద్రారెడ్డి: సమాజంలో అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దళిబంధు పథకాన్ని తీసుకువచ్చాం. కేవలం సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాక దళిత వర్గాలకు ఆర్థిక స్వావలంబన అందించడమే ప్రభుత్వ ధ్యేయం. అంతేకాక దళిత వర్గాలను ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తులను చేసేందుకుగాను సీఎం కేసీఆర్ దళితబంధును అమల్లోకి తెచ్చారు. దళిత సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. దళితబంధు పథకం ఓ చారిత్రాత్మక నిర్ణయం.
నమస్తే తెలంగాణ: దళితబంధుతో ఎలాంటి మార్పు రానుంది?
మంత్రి: దళితబంధుతో అట్టడుగు వర్గాలకు భరోసా లభించడం ఖాయం. ఈ పథకం అమలైతే ఆ వర్గాలు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. ఆర్థిక ఇబ్బందులూ తొలగించేలా పథకాన్ని రూపొందించినందున ఆ వర్గాలు సమాజంలో తలెత్తుకొని తిరుగుతాయి. దళిత వర్గాలు ఎదిగితే వారి పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మరికొందరికి ఉపాధి లభించడం ఖాయం. దళిత బంధు అమలుతో సమాజిక మార్పు తథ్యం. రాబోయే రోజుల్లో దళితుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.
నమస్తే తెలంగాణ: లబ్ధిదారుల ఎంపిక ఎప్పటిలోగా పూర్తి కానుంది?
మంత్రి : లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరింది. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఈ నెలాఖరు లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఫిబ్రవరి 5 లోగా లబ్ధిదారుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు చేపట్టాం. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్, నిధుల మంజూరులో దళారుల పాత్ర అసలే ఉండదు. అంతా పారదర్శకం.
నమస్తే తెలంగాణ: యూనిట్లను ఎప్పటిలోగా అందిస్తారు?
మంత్రి: ఫిబ్రవరి ఆఖరులోగా లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూస్తాం. మార్చి 7లోగా లబ్ధిదారులందరూ వారు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి వ్యాపారాలు ప్రారంభించేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించాం.
నమస్తే తెలంగాణ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది?
మంత్రి : పథకంలో భాగంగా నియోజకవర్గానికి వంద దళిత కుటుంబాలను ఎంపిక చేసి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయనున్నాం. ఉమ్మడి జిల్లాలోని, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఆమన్గల్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో కలిపి మొదటి దఫాలో మొత్తం 1200 మందికి మార్చి 7లోగా రూ.10 లక్షల చొప్పున మంజూరు అవుతాయి.
నమస్తే తెలంగాణ: యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించారా?
మంత్రి: యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులదే తుది నిర్ణయం. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లనే సమకూర్చుతాం. అంతేకాక లబ్ధిదారులకు నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి
నమస్తే తెలంగాణ: వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చా?
మంత్రి: దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అంతేకాక వ్యాపారంలో భాగంగా ఒకేసారి రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎంపికైన కుటుంబంలో ముగ్గురు సంతానం ఉంటే మూడు వ్యాపారాలు చేసుకోవచ్చు. యూనిట్ల ఎంపికతో పాటు వ్యాపార నిర్వహణలో ఎలాంటి షరతులు లేవు.
నమస్తే తెలంగాణ: రక్షణ నిధితో కలిగే ప్రయోజనం?
మంత్రి: దళితబంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం. అయితే లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్లో రూ.10 వేలతో రక్షణ నిధిని ఏర్పాటు చేయనున్నారు. వ్యాపారంలోగాని ఇతరత్రా ఏదైనా కష్టమొచ్చినప్పుడు లబ్ధిదారులను రక్షణ నిధితో ఆదుకోవచ్చు.
నమస్తే తెలంగాణ: ప్రభుత్వం నుంచి పర్యవేక్షణ ఉంటుందా?
మంత్రి: లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేసిన అనంతరం నిరంతరం అధికారులు పర్యవేక్షణ చేస్తారు. వ్యాపారం నడిచే తీరును పరిశీలిస్తారు. ఓ వేళ ఏమైనా సమస్యలుంటే మెళకువలు నేర్పించడం.. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. లబ్ధిదారులు వ్యాపారంలో రాణించి.. ఆర్థికంగా ఎదిగే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది.