ప్రభుత్వ పాఠశాల అంటే ఎవరికీ పట్టదు. సర్కారు అడుగు ముందుకేస్తే తప్ప ఆ పాఠశాల బాగుపడదనేది సర్వ సాధారణం. కానీ బాలాపూర్ మండలం కొత్తపేటలోని ప్రభుత్వప్రాథమికోన్నత పాఠశాల మాత్రం అందుకు అతీతం. ఆ చదువులమ్మ ఒడిని ప్రతి ఒక్కరూ తమ బడిగా భావించారు. స్థానిక ఎన్నారై, ప్రజాప్రతినిధులు, పాఠశాలలోని ఉపాధ్యాయులు, చివరకు బడిలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు.. ఎవరికి వారు తలోచేయి వేశారు. ఒకరు ఆర్థికంగా ఆదుకుంటే… మరొకరు అంకితభావంతో పని చేశారు… ఇంకొకరు తమ బాధ్యతగా చిన్న అవసరాన్నీ తీర్చేందుకు ముందుకొచ్చారు. సరిపడ ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థుల తల్లులు ముగ్గురు ఉచితంగా విద్యా బోధన చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇంకేముంది.. కార్పొరేట్‌కు దీటుగా నిలిచిన ఈ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు క్యూ కట్టారు. కేవలం ఈ ఒక్క ఏడాదే ఏకంగా 256 కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి.
హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉందనే పేరేగానీ… రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని కొత్తపేట మారుమూలన ఉన్నట్టుగా ఉంటుంది. నిన్నటిదాకా ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. దీంతో ఆరో తరగతి నుంచి చదవాలంటే కిలోమీటర్ల దూరంలోని బాలాపూర్, బడంగ్పేటగానీ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనుకోని రీతిలో ఆ పాఠశాలకు మహర్దశ వచ్చింది. స్థానికుడైనా ఉమర్ వహల్వాన్ అనే వ్యక్తి దుబాయ్‌లో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. ఈ పాఠశాలను బాగుపరచాలనే మంచి ఉద్దేశంతో ఆయన పాత భవనం స్థానంలో కొత్త భవన నిర్మాణానికి ముందుకొచ్చారు. దాదాపు కోటి రూపాయలకు పైగా వెచ్చించి 16 గదులతో జి+1 భవనాన్ని నిర్మించి ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్రెడ్డి, మరో ఇద్దరు ఉపాధ్యాయులు దగ్గర ఉండి భవన నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. నిర్మాణ సమయంలో ప్రతి రోజు ఇద్దరూ వచ్చి నీళ్లు కొట్టడం చేశారు. ఫలితంగా కొత్తపేట పాఠశాలకు కార్పొరేట్‌కు దీటుగా అందమైన భవనం తయారైంది.
గురువుకు నిర్వచనంగా..
కొత్తపేట పాఠశాల ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకే పరిమితం కాలేదు. పాఠశాల మౌలిక వసతులపై స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులను కలవడం, వాటిని సమకూర్చడం ఒక విధిగా పెట్టుకున్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ షాహీనా వీరికి బాసటగా నిలిచారు. ప్రతి రోజు ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్ తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా వారే సిద్ధం చేస్తారు. ముగ్గురు ఉపాధ్యాయులు సొంతంగా డబ్బులు వెచ్చించి పాఠశాలలో అదనపు టాయిలెట్స్ నిర్మాణం చేయించారు. ఓ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలకు రంగులు వేయించారు. విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ వారే కొనుగోలు చేస్తున్నారు. మాస్క్‌లు, డ్రస్సులు కూడా అందజేస్తున్నారు. దాతల సహాయంతో స్కూల్ దుస్తువులు, ప్లేట్స్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యుల దగ్గరకు తీసుక పోయి వైద్యం చేయిస్తారు.
ఆదర్శంగా పేరెంట్స్..
కొత్తపేట పాఠశాలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం అప్‌గ్రేడ్ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చడంతో గతేడాది ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్న ఇక్కడ అదనంగా రెండు తరగతులు పెరిగాయి. అన్నిరకాల వసతులు ఉండటంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఇప్పటికే పాఠశాలలో ఏకంగా 256 కొత్త అడ్మిషన్లు నమోదు కావడంతో విద్యార్థుల సంఖ్య ఏకంగా 356కి చేరింది. ఇదే ఏడాది అప్‌గ్రేడ్ కావడంతో ఇంకా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు పాలనాపరంగా కొంత సమయం పడుతుంది. ఇప్పటికీ గతంలోని ముగ్గురు ఉపాధ్యాయులే ఉండటం ఇబ్బందిగా మారింది. దీంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులు ముగ్గురు షాబియా బేగం, మెహక్ సుల్తానా, శభానా బేగం ఉచితంగా చదువు చెప్పేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇలా అందరి సహకారంతో కొత్తపేట యూపీఎస్ విద్యార్థుల సందడితో కళకళలాడుతుంది.