
సిటీబ్యూరో, నవంబర్ 11 ( నమస్తే తెలంగాణ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్న ఈ ఉత్సవంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర, ఉడుపి పెజావర్ పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానందభారతి, గణపతి సచ్చిదానంద స్వామితో పాటు ప్రవచన కర్తలు చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ, గరికపాటి నరసింహారావు పాల్గొంటారు. భక్తులు స్వయంగా విశేష పూజలు చేసుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అంతేకాక తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారక తిరుమల, ఒంటిమిట్ట తదితర ఉత్సవ మూర్తుల కల్యాణోత్సవాలు జరుగుతాయి. పదకొండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణలింగోద్భవం, మహానీరాజనం, సప్తహారతులు, సాంస్కృతిక కదంబాలు వంటి ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ప్రవేశం ఉచితంగా ఉంటుంది. డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారు లేదా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్న వారిని అనుమతిస్తారు. దేవతామూర్తులు, దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలన్నింటిని ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.