గోల్నాక,ఆగస్టు 8: అంబర్‌పేట డివిజన్లో ప్రధాన ప్రాంతమైన పటేల్‌నగర్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హామీ ఇచ్చారు. సోమవారం అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్ ప్రాంతవాసులు స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ముఖ్యంగా తమ ప్రాంతంలో డ్రైనేజీ, తాగునీటి సరఫరాలో సమస్యలు, శిథిలావస్థకు చేరిన కరెంటు స్తంభాలు, వెలగని వీధిదీపాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన దృష్టికి వచ్చిన సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటేల్‌నగర్, న్యూపటేల్నగర్, నరేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కొత్త డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల ఏర్పాటు, కరెంటు స్తంభాల ఏర్పాటు, వీడీసీసీ రోడ్డు నిర్మాణాల పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో పటేల్‌నగర్ ప్రతినిధులతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.