సిటీబ్యూరో, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేసిన బుక్ ఫెయిర్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మీడియా అకాడమీ కార్యాలయంలో సోమవారం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం, అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ తర్వా త పుస్తక ప్రదర్శనకు లక్షలాది మంది రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందన్నారు. కవులు, రచయితలు, సామాజిక వేత్తలు, పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల వారికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్, కార్యదర్శి చంద్రమోహన్, ఇంకా పుస్తక ప్రేమికులు, సాహితీ వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.