Suicide | న్యూఢిల్లీ : మీ అమ్మ మనతో కలిసి ఉండటానికి వీల్లేదు అని భార్య వేధింపులకు గురి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన యోగేశ్ కుమార్‌కు నెహా రావత్ అనే మహిళతో తొమ్మిదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల పాప ఉంది. యోగేశ్ కుమార్ వృత్తిరీత్యా రేడియోథెరపిస్ట్. కాగా గురుగ్రామ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. నేహా రావత్ ప్రయివేటు ఉద్యోగి.
ఇక పెళ్లైనప్పటి నుంచి ఈ దంపతులిద్దరూ నోయిడాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో.. బిడ్డ ఆలనాపాలనా చూసుకునేందుకు యోగేశ్ తన తల్లిని నోయిడాకు పిలిపించాడు. ఆమె రావడం నేహా రావత్‌కు ఇష్టం లేదు. దీంతో దంపతుల మధ్య వివాదాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఆరు నెలల క్రితం యోగేశ్ ఫరీదాబాద్‌లోని సెక్టార్ 87లోని పియరల్ సొసైటీకి తన బిడ్డతో కలిసి షిఫ్ట్ అయ్యాడు. నోయిడా నుంచి నేహా వచ్చేందుకు అంగీకరించలేదు. మళ్లీ తన బిడ్డ కోసం తల్లిని పిలిపించాడు. ఇక నెల రోజుల క్రితం నేహానే.. యోగేశ్ నివాసం ఉంటున్న పియరల్ సొసైటీకి వచ్చింది. తమ వద్ద మీ అమ్మ ఉండటానికి వీల్లేదు.. గ్వాలియర్ పంపించేయ్.. అప్పుడే నీతో ఉంటాను అని తెగేసి చెప్పింది నేహా.
గురువారం నాడు తన భార్యతో కలిసి యోగేశ్ గ్వాలియర్ వెళ్లాడు. తిరిగి ఫరీదాబాద్ చేరుకునే క్రమంలో భార్యను నోయిడాలో వదిలిపెట్టాడు. యోగేశ్ ఒక్కడే పియరల్ సొసైటీకి చేరుకున్నాడు. తాను నివాసం ఉంటున్న 15వ అంతస్తు నుంచి దూకి యోగేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యోగేశ్ బంధువు ప్రకాశ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేహా రావత్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు శాంతి రావత్, వీర్ సింగ్ రావత్, సోదరులు అశిష్ రావత్, అమిత్ రావత్ వేధింపుల వల్లే యోగేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకాశ్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.