Chiranjeevi | కొత్తగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కమిటీ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ అసోసియేషన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మెగాస్టార్‌కు వివరించారు.TFJA సభ్యులు మాట్లాడుతూ, సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం లేదా అనారోగ్యం వచ్చినప్పుడు సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అలాగే భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
సినిమా రంగంలో కష్టపడే జర్నలిస్టుల కోసం TFJA చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చిరంజీవి అభినందించారు. అసోసియేషన్ పనితీరుపై ప్రశంసలు కురిపించిన ఆయన, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలకు తనవంతు సహాయం ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసిన వారిలో TFJA అధ్యక్షుడు వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, అలాగే ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సినిమా రంగంలో జర్నలిస్టుల శ్రేయస్సు కోసం TFJA చేస్తున్న కృషిని మెగాస్టార్ ప్రశంసించడంతో, అసోసియేషన్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు విశ్వంభర చిత్రం కూడా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.