Peacocks Dies | చెన్నై : తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఘోరం జరిగింది. ఎలుకల మందు తిని ఓ 50 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటనలో రైతును పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తెన్‌కాశీ జిల్లా పరిధిలోని మీనాక్షిపురం గ్రామానికి చెందిన రైతు జాన్సన్ తనకున్న ఎకరా పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. అయితే పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. దీంతో పక్షులు, జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు.. పొలం చుట్టూ ఆహార పదార్థాల్లో ఎలుకల మందును కలిపి ఉంచాడు.
ఇక మొక్కజొన్న చేను వద్దకు వచ్చిన నెమళ్లు ఆ ఆహార పదార్థాలను తిన్నాయి. ఆ తర్వాత అక్కడే ప్రాణాలు విడిచాయి నెమళ్లు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పోలీసులతో కలిసి జాన్సన్ పొలం వద్దకు చేరుకున్నారు. 50 వరకు నెమళ్లు మృతి చెందాయని అటవీశాఖ అధికారులు తేల్చారు. నెమళ్ల కళేబరాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైతు జాన్సన్‌ను అరెస్టు చేశారు.