ధరల పెంపునకు నిరసనగా ఆగ్రహ జ్వాల రాజుకున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిలిండర్లతో మహిళలు ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రోడ్లపై కట్టెల పొయ్యిపై వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో మహిళలు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. భూత్పూరులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎడ్లబండిపై ర్యాలీగా వచ్చి పెట్రోల్, డీజిల్ కొనలేని పరిస్థితిలో జనం ఉన్నారని నిరసన వ్యక్తం చేశారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేటలో నిరసనలు కొనసాగాయి. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జడ్చర్లలో ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, వనపర్తి జిల్లా చిన్నంబావిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆందోళనల్లో పాల్గొన్నారు. కేంద్రం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని వారు పిలుపునిచ్చారు.
మూసాపేట(అడ్డాకుల), మార్చి 24 : చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృత్యువాత పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం ముత్యాలంపల్లి గ్రామ పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం వద్ద చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ సమీపంలోని పెద్దవాగులో నిర్మించిన చెక్‌డ్యాం వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బోయ కృష్ణయ్య (56), కొత్తచెరువు శ్రీనివాసులు (32) చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వల వేస్తుండగా ప్రమాదవశాత్తు వల వారి కాళ్లకు చుట్టుకొని చెరువులో పడి మృతి చెందారు. ఉదయం రవి అనే వ్యక్తి చెక్‌డ్యాం వద్దకు వెళ్లగా మృతదేహం ఉండడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియజేయడంతో తాసిల్దార్ కిషన్, నాయబ్ తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై విజయ్‌కుమార్, ఏఎస్సై గోపాల్ నాయక్ వెళ్లారు. వలలో చిక్కుకున్న కృష్ణయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. శ్రీనివాసులు మృతదేహం లభ్యం కాకపోవడంతో ఉన్నతాధికారులతోపాటు నాయకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం అందించారు. జిల్లా కేంద్రం నుంచి ఫైర్ సిబ్బంది, కోయిల్‌సాగర్ నుంచి గత ఈతగాళ్లు, బోటును తీసుకొచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. మూడు గంటల తర్వాత మృతదేహం లభించింది. శవపరీక్ష తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.