భీమ్‌గల్ / బాల్కొండ నియోజకవర్గం : విలాసాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth ) గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) ఆరోపించారు.
నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణ అభివృద్ధి పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌కు ఇప్పటికే ఒక హెలికాప్టర్ ఉండగా నెలకు రూ. 5 కోట్లకు పైగా అద్దెతో ఏకంగా రూ.111 కోట్లు వెచ్చించి అదనపు హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడం ఏ రకమైన పొదుపు అని ప్రశ్నించారు.
మనుమడి కోసం రూ.10 కోట్లతో ఫుట్‌బాల్ కోర్టులు, మెస్సీ పర్యటనల పేరిట ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు, అందాల పోటీలకు 100 కోట్లు,శంషాబాద్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ సొంత భూముల ధర పెరగడం కోసం కొడంగల్ నుండి శంషాబాద్ వరకు రూ.3,500 కోట్లతో 6 వరుసల రహదారిని చేపట్టడానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని . గత కాంగ్రెస్ పాలనలో మూతపడ్డ వ్యవస్థలను తాము అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తూ, బిల్లులు నిలిపివేసి భీమ్‌గల్ అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తున్నారని మండిపడ్డారు.

మున్సిపల్ ఎన్నికల వేళ హడావుడిగా కొబ్బరికాయలు కొట్టి కంకర పోసిన కాంగ్రెస్ పాలకులు, గత 7-8 నెలలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని విమర్శించారు. పట్టణ ప్రజలు, చిరువ్యాపారుల సౌకర్యార్థం రూ.3.50 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించి 50 శాతానికి పైగా పనులు పూర్తి చేయించామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించామని, మిగిలిన సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని ఆందో ళన వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల హామీలు ఏమయ్యాయి?
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 9న భీమ్‌గల్ వచ్చిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పట్టణాన్ని దత్తత తీసుకుంటానని, మూడు నెలల్లో రూ. 5 కోట్లు విడుదల చేయించి 100 పడకల ఆసుపత్రితో పాటు అన్ని పనులు పూర్తి చేస్తానని బహిరంగ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని నమ్మి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్‌గా గెలిపించినా, మూడు నెలల గడువు ముగిసి ఆరు నెలలు కావస్తున్నా అదనంగా ఒక్క రూపాయి నిధులు తేలేకపోయారని విమర్శించారు.
ఖజానాలో డబ్బులు లేవనే సాకు చెబుతున్న ప్రభుత్వం, బడ్జెట్లో అధికారికంగా మంజూరైన పనులను నిలిపివేయడం ముమ్మాటికీ ప్రజాద్రోహమని మండిపడ్డారు. భీమ్‌గల్ అభివృద్ధి సాధన కోసం తదుపరి ఏ రూపంలో పోరాటం చేయాలో ప్రజలే మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతటి ఉద్యమానికైనా తాను సిద్ధమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ మహేష్, జిల్లా కో అప్షన్ మొయిజ్, శర్మ నాయక్, తుకాజీ నాయక్, శివసారి నర్సయ్య, కౌన్సిలర్ నీలం రవి,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.