Cova Bun Issue | ఆకలి తీర్చే అన్నానికి మతం రంగు పులిమాలని చూసిన కొందరు వ్యక్తులకు(యూట్యూబర్) తెలుగు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. పొట్ట కూటి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేడారం జాతరకు వచ్చి కేవలం 10 రూపాయలకే కోవా బన్ అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఒక సామాన్య వ్యాపారిని, కొందరు మతపరమైన కోణంలో లక్ష్యంగా చేసుకుని అవమానించడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. అయితే అవమానించింది పది మందే కావచ్చు, కానీ సామాన్యుడికి అండగా నిలిచింది లక్షలాది మంది అని నెటిజన్లు నిరూపించారు.
అసలు వివాదం ఏమిటి?
మేడారం జాతరలో తక్కువ ధరకే నాణ్యమైన కోవా బన్ అందిస్తున్న ఒక ముస్లిం వ్యక్తి వద్దకు వెళ్లిన ఒక యూట్యూబర్.. అతడు అమ్ముతుంది నాసిరకం కోవా బన్ అని చెప్పి అతడిని బెదిరించడం ప్రారంభించాడు. అంతేగాకుండా అతడు ఒక కమ్యూనిటీకి చెందినవాడు అని తెలుసుకుని వ్యంగంగా అతడిపై కామెంట్లు చేయడం.. అతడు ఆధార్ కార్డు చూపించమంటూ దబాయించాడు. “పది రూపాయలకే కోవా బన్ ఎలా ఇస్తున్నావు? ఇందులో ఏదో కలిపావు! “నీవు ఏదో కుట్ర చేస్తున్నావు.. మా హిందు మతస్థుల ఆరోగ్యం పాడు చేస్తున్నావు. అంటూ సదరు వ్యాపారిని చుట్టుముట్టి భయబ్రాంతులకు గురిచేశారు. కేవలం తమ ఛానల్ వీడియోలకు వ్యూస్ పెంచుకోవడానికే ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు ఆ యూట్యూబర్. అయితే ఈ వీడియో కొన్ని రోజులకే విపరీతంగా వైరల్‌గా మారింది.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు, నెటిజన్లు ఏకతాటిపైకి వచ్చి ఆ వ్యాపారికి మద్దతు ప్రకటించారు. మతం పేరుతో సామాన్యుడిని వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద పెద్ద రెస్టారెంట్లు, కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు లేని ‘కల్తీ’ అనుమానం, ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్ముతుంటే ఎందుకు వస్తుంది? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ (FSSAI) ఉంది. అధికారులు తనిఖీలు చేసి తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ, వీధుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మతపరమైన దూషణలు చేయడం నేరమని ఆ యూట్యూబర్లను మేధావులు హెచ్చరిస్తున్నారు.
ఇదే విషయంపై తెలంగాణ రచయిత.. సాంకేతిక నిపుణుడు కోణతం దిలీప్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనను ఖండించాడు. రాయలసీమకు చెందిన షేక్ షావలి ఇటీవల జరిగిన మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటుండగా ఒక మతోన్మాద యూట్యూబ్ చానెల్ వారు ఆయన మీద తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఒక చిరువ్యాపారి మీద ఈ దుర్మార్గానికి పాల్పడ్డ మతోన్మాదుల మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. షేక్ షావలికి అండగా అనేకమంది ముందుకు వచ్చారు. ఆయనకు కొందరు ఆర్థిక సాయం కూడా చేశారు. మతోన్మాదంతో సమాజాన్ని చీల్చి, ఓట్ల వేటలో విజయం సాధించాలనుకునే శక్తుల క్షుద్ర రాజకీయాలను ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో ఖండించడం చూసి ఎంతో సంతోషం కలిగింది. మానవత్వం ఇంకా మిగిలే ఉన్నదని ఈ ఘటన నిరూపిస్తున్నది. పూలో, పండ్లో, ఏదన్నా తినుబండారమో అమ్ముకునే, చిరువ్యాపారాలు చేసుకునే ముస్లింల మీద గత కొన్నేళ్లుగా బీజేపీ ప్రేరేపిత శక్తులు దాడులు చేస్తున్నాయి. వారి షాపులు బాయ్‌కాట్ చేయాలనే పిలుపులు ఇప్పుడు పల్లెటూళ్లకు కూడా వ్యాపించాయి. వారి జీవనోపాధిని దెబ్బతీసి, వారిని అతివాదం వైపు వెళ్లే దిక్కుతోచని స్థితి కల్పిస్తున్నారు కొందరు మూర్ఖులు. దీనికి షేక్ షావలి ఉదంతమే తాజా ఉదాహరణ. మతం ఆధారంగా విద్వేషం రగిల్చి భారత సమాజాన్ని చీల్చే శక్తుల పట్ల (వారే మతం వారైనా) అప్రమత్తంగా ఉండకపోతే, దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. అంటూ కోణతం దిలీప్ రాసుకోచ్చాడు.
రాయలసీమకు చెందిన షేక్ షావలి ఇటీవల జరిగిన మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటుండగా ఒక మతోన్మాద యూట్యూబ్ చానెల్ వారు ఆయన మీద తప్పుడు ప్రచారం చేశారు.
అయితే ఒక చిరువ్యాపారి మీద ఈ దుర్మార్గానికి పాల్పడ్డ మతోన్మాదుల మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. షేక్ షావలికి అండగా… pic.twitter.com/aBJZoykNVT
— Konatham Dileep (@KonathamDileep) February 13, 2026