జోగులాంబ గద్వాల్ : జిల్లాలోని ధర్మవరం బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ (Food Poison) తో ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ( Human Rights Commission) సీరియస్ అయ్యింది. ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించింది. హాస్టల్లో 55 మంది విద్యార్థులు అస్వస్థత , హాస్టల్లో ఆహార భద్రత, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈనెల 24 ఉదయం 11 గంటలకు సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా, శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వీరిలో 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.
విద్యార్థుల అస్వస్థత పై కలెక్టర్ బి.ఎం.సంతోష్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జయరాములును విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. సస్పెన్షన్ కాలంలో జయరాములు జోగులాంబ గద్వాలలోనే ఉండాలని ఆదేశించారు.
ముందస్తు లిఖిత అనుమతి పొందకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు. ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహానికి తాత్కాలిక వెల్ఫేర్ ఇన్చార్జి ఆఫీసర్‌గా ఆలంపూర్ ఆఫీసర్ డి. శేఖర్‌ను నియమించినట్లు తెలిపారు.