ఎల్బీనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ ) : పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చైతన్యపురిలో నిరుద్యోగులు మంగళవారం చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగాలు ఏవంటూ సీఎం రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాలను నినదిస్తూ నిరుద్యోగులు చైతన్యపురి నుంచి దిల్సుఖ్నగర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ప్రాంతమంతా నిరుద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని నిరుద్యోగులు పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా ర్యాలీని అడ్డుకున్నారు. నిరుద్యోగులను పోలీస్స్టేషన్లకు తరలించేందుకు యత్నించిన సమయంలో పోలీసులు, నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. నిరుద్యోగులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, భూక్యా కుమార్లను సరూర్నగర్ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనం ఎక్కించారు. జీపులోకి ఎక్కించిన తర్వాత పోలీసులు తమపై పిడిగుద్దులతో దాడి చేశారని బాధితులు వాపోయారు.

భూక్యాకుమార్, ఇంద్రానాయక్పై సరూర్నగర్ పోలీసులు సెక్షన్ 126/2, 291/5 బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. మరికొందరు నిరుద్యోగులను నాగోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరుద్యోగుల నిరసనతో ఎన్హెచ్-65పై రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.