దేశం గర్వించదగ్గ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. పుష్పకవిమానం, విచిత్రసోదరులు, మైఖేల్ మదనకామరాజు, ఆదిత్య 369, భైరవద్వీపం, వెల్కం ఒబామా.. ఇప్పుడు ‘సింగ్ గీతం’. అన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. ఇండియన్ సిల్వర్ స్క్రిన్‌పై బహుశా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఏ దర్శకుడూ చేయలేదేమో. మాటల్లేకుండా ‘పుష్పక విమానం’ వంటి క్లాసిక్‌ని తీసిన సింగీతం.. తాజాగా ‘మాటలే పాటలుగా మారితే?’ అనే కాన్సెప్ట్‌తో ‘సింగ్ గీతం’ సినిమా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా సింగీతం ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇది నా 40ఏళ్ల కల. ప్రతి మాటనూ పాడుతూ చెప్పే సినిమా చేయాలని కలలు కన్నాను. దశాబ్దాలుగా ఈ కథ నాతోనే ప్రయాణించింది. చివరకు నాగ్అశ్విన్ దృష్టికి వెళ్లింది. నా ఆలోచనను ఆయనెంతో ఇష్టపడి, అభిరుచితో ముందుకు తీసుకెళ్లారు. ఆయన సహకారం లేకపోతే ఈ సినిమా రూపుదాల్చేది కాదు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాగ్అశ్విన్కే చెందుతుంది.
నేనే ఈ కథను తెరకెక్కించాలనేది నాగ్అశ్విన్ అభిమతం. నాలో దర్శకత్వం వహించాలనే ఉత్సాహం ఉన్నా కూడా, వయసు సహకరించదు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే సాంకేతిక సహకారంలో ఆన్లైన్లో సినిమాను తెరకెక్కించే విధానాన్ని నాగ్అశ్విన్ ఏర్పాటు చేశారు. కెమెరాలు, మానిటర్లు.. ఇలా అన్నీ నాకు కనెక్టయి ఉండేవి. హోమ్ థియేటర్లో కూర్చొని లొకేషన్ని ప్రత్యక్షంగా చూస్తూ మొత్తం ఇంటి నుంచే సినిమాను డైరెక్ట్ చేశాను. ఇది అద్భుతమైన మేనేజ్మెంట్. ఇలాంటి విధానాన్ని సాధ్యం చేసింది నాగ్ అశ్విన్ మాత్రమే.
ఈ సినిమాలో పాటల ద్వారా కథ చెప్పాలి కాబట్టి, నటీనటుల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఇందులో నటించిన కళాకారులంతా స్వయంగా పాటలు పాడారు. సాధారణంగా సినిమాకు ప్లేబ్యాక్ సింగర్లుంటారు. కానీ ఈ సినిమాకు నటులే గాయకులు. ఇది జెన్‌జీ ప్రేక్షకుల కోసం రూపొందించిన సినిమా.
చదువుకునే రోజుల్లో తెలుగు సినిమాలు మాత్రమే చూసేవాడ్ని. మద్రాస్ వెళ్లాక, తెలుగుతోపాటు తమిళ సినిమాలు కూడా చూడటం మొదలుపెట్టాను. ఆ టైమ్‌లోనే నా దృష్టి హాలీవుడ్ సినిమాలపై మళ్లింది. చివరకు హాలీవుడ్ సినిమాకు అడిక్ట్ అయిపోయాను. గాన్ విత్ ది విండ్, ఫ్రం హియర్ టు ఎటర్నిటీ వంటి ఆస్కార్ క్లాసిక్స్ మళ్లీ మళ్లీ చూసేవాడ్ని. ఆ సినిమాల ప్రభావం నాపై చాలావుంది. ఆ తర్వాత జపాన్, ఇరాన్, మెక్సికో, శ్రీలంక తదితర దేశాలకు చెందిన సినిమాలు కూడా చూడటం మొదలుపెట్టాను. హాలీవుడ్ సినిమాలకంటే అవి నన్ను ఎక్కువ ఆకర్షించాయి. రీసెంట్గా వచ్చిన సినిమాల విషయానికొస్తే.. కాంతార, పుష్ప2 సినిమాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ‘కాంతార’ చాలా గొప్ప సినిమా. ఇక ‘పుష్ప 2’లో హీరో పాత్ర చిత్రణ నాకెంతో నచ్చింది.