న్యూఢిల్లీ: నీట్-2026, సీయూఈటీ, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకల గురించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026పై కూడా తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిలిమ్స్ పరీక్ష పత్రం లీకేజీ, అక్రమాలపై కాంగ్రెస్కు చెందిన ఎన్ఎస్యూఐ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని యూపీఎస్సీని డిమాండ్ చేసింది.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రంలోని 100 ప్రశ్నల్లో 82 ప్రశ్నలు అనంతం ఐఏఎస్ శిక్షణ సంస్థ స్టడీమెటీరియల్తో సరిపోలాయని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ ఆరోపించారు. ప్రశ్నలు కేవలం నోట్స్లోని విషయాన్నే కాకుండా వాటి పదజాలాన్ని అమరికను కూడా కలిగి ఉన్నాయని తెలిపారు. పరీక్ష తర్వాత నోట్స్లోని ప్రశ్నల్లో మార్పు చేశారని, మెటీరియల్లో ఉన్న తేదీలను కూడా మార్చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై యూపీఎస్సీ సమగ్ర దర్యాప్తు జరుతపాలని ఆయన డిమాండ్ చేశారు.