Bloating | వేసవి కాలంలో కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్న సమయంలో శరీరంలో నీటి లోపం, అజీర్ణం, తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడం వంటి కారణాల వల్ల పొట్ట ఉబ్బినట్లు, భారంగా అనిపించడం సాధారణమే. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం ఇవ్వడంతోపాటు జీర్ణక్రియకు సహాయపడే పండ్లను తీసుకోవాలని చూస్తూ ఉంటారు. అందులో బొప్పాయి (Papaya), అనాసపండు (Pineapple) ప్రధానంగా చర్చకు వస్తాయి. ఈ రెండు పండ్లలో కూడా జీర్ణక్రియకు ఉపయోగపడే ప్రత్యేక ఎంజైములు ఉండటంతో, బ్లోటింగ్ తగ్గించడంలో సహాయపడతాయని భావిస్తారు. అయితే ఏ పండు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ప్రయోజనం ఇస్తుందో తెలుసుకోవడం అవసరం. అసలు వేసవిలో బ్లోటింగ్ ఎందుకు ఎక్కువ అవుతుంది? అలాంటి సమయంలో ఏ పండును తీసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చు .. అన్న వివరాలను వైద్యులు వివరిస్తున్నారు.
వేసవి కాలంలో అధిక చెమట వల్ల శరీరంలో నీటి లోపం ఏర్పడుతుంది. దీని ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుంది. నీరు తక్కువగా ఉండటం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక పొట్ట ఉబ్బరం సమస్య వస్తుంది. అలాగే వేసవిలో ఎక్కువగా పండ్లు తినడం, ఒకేసారి అధిక మోతాదులో తీసుకోవడం కూడా గ్యాస్, ఫెర్మెంటేషన్కు (పులవడం) దారితీస్తుంది. వేడి కారణంగా జీర్ణక్రియ మందగించడం కూడా మరో కారణంగా ఉంటుంది. సాధారణంగా బొప్పాయిలో పపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విభజించి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అందువల్ల పొట్టలో భారంగా అనిపించడం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. బొప్పాయి తేలికగా జీర్ణమయ్యే పండు. ఇందులో తక్కువ ఆమ్లత్వం (Low Acid) ఉండటం వల్ల సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి, పొట్ట సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది.
అలాగే అనాసపండులో బ్రోమెలైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది కూడా ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మాంసాహారం లేదా అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తిన్న తర్వాత తీసుకుంటే జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అయితే అనాసపండులో సహజ ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే చక్కెర శాతం కూడా కొంత ఎక్కువగా ఉండటం వల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో గ్యాస్, కడుపు మంట, బ్లోటింగ్ను మరింత పెంచే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక ఈ పండ్ల మధ్య ముఖ్య తేడాలను గమనించిట్లయితే బొప్పాయిలోని పపైన్ సాధారణ జీర్ణక్రియను సాఫీగా ఉంచడంలో సహాయపడుతుంది. అనాసలోని బ్రోమెలైన్ మరింత శక్తివంతంగా పనిచేసి గట్టి ప్రోటీన్లను విభజిస్తుంది. బొప్పాయి తక్కువ ఆమ్లత్వం కలిగిన పండు. అనాసపండు సహజంగా ఆమ్ల గుణం ఎక్కువగా కలిగి ఉంటుంది. అదే విధంగా బొప్పాయిలోని ఫైబర్ పొట్టకు మృదువుగా పనిచేస్తుంది. అనాసలో కొంత ఎక్కువ ఇన్సోల్యూబుల్ ఫైబర్ ఉండటంతో కొందరిలో గ్యాస్ సమస్య పెరుగుతుంది. సున్నితమైన జీర్ణాశయం లేదా IBS సమస్య ఉన్నవారికి బొప్పాయి ఎక్కువగా అనుకూలంగా భావిస్తారు. అనాసపండు కొందరిలో జీర్ణాశయం గోడలకు చికాకు కలిగించే అవకాశం ఉంటుంది.
అలాగే భారీగా భోజనం చేసిన తర్వాత వచ్చే భారంగా అనిపించే బ్లోటింగ్కు బొప్పాయి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న తర్వాత అనాసపండు కొద్దిమోతాదులో తీసుకుంటే సహాయపడుతుంది. IBS లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు బొప్పాయిని ఎంచుకోవడం మంచిదిగా భావిస్తున్నారు. యాసిడ్ రిఫ్లక్స్ లేదా కడుపుమంట సమస్య ఉన్నవారు అనాసపండును తగ్గించడం మంచిది. పండ్లు ఆరోగ్యకరమైనవే అయినా, అధిక మోతాదులో తీసుకుంటే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వేసవిలో కేవలం పండ్లతోనే భోజనం చేయడం లేదా ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల పరిమిత మోతాదులో తీసుకోవడం అవసరం. బ్లోటింగ్ సమస్యను తగ్గించడంలో బొప్పాయి సాధారణంగా సురక్షితమైన, జీర్ణాశయానికి మృదువైన ఎంపికగా భావిస్తున్నారు. అనాసపండు కూడా జీర్ణక్రియకు సహాయపడినా, అది ప్రతి ఒక్కరికీ సరిపోవచ్చు అనడం కష్టం. వ్యక్తిగత జీర్ణవ్యవస్థ, ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ పండ్ల ప్రభావం మారవచ్చు. కాబట్టి తరచూ బ్లోటింగ్ సమస్య ఉంటే పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.