VD Satheesan : కేరళం రాష్ట్రం (Keralam State) లో ఇక కొత్త శకం మొదలైందని, జనం కొత్త కేరళంను చూడబోతున్నారని ఇవాళ (గురువారం) ఉదయమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్ (VD Satheesan) అన్నారు. కేరళలో ఆర్థిక పరిస్థితి (Fiscal situation) ప్రస్తుతం ఎంత అధ్వాన్నంగా ఉన్నదో మీ అందరికీ తెలుసని, ముందుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న ప్రతిదాన్ని మార్చేస్తామనే నమ్మకంతో తాము ముందుకు వెళ్తామని చెప్పారు.
ముఖ్యమంత్రిగా ఎంపికైన తనకు అభినందనలు వెల్లువలా వస్తున్నాయని సతీశన్ తెలిపారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోని ప్రతి ఒక్కరూ తనకు అభినందనలు తెలియజేశారని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ మీరు ఇవాళే గవర్నర్ను కలువబోతున్నారా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ఈ విషయంపై నేను మా పార్టీ నాయకులతో, సంకీర్ణ పార్టీల అధ్యక్షులతో మాట్లాడాల్సి ఉంది. వారితో మాట్లాడిన అనంతరం గవర్నర్ను ఎప్పుడు కలుస్తామనే విషయంలో స్పష్టత వస్తుంది’ అని చెప్పారు.
ఈ విజయం తన ఒక్కడిది కాదని, అందరం సమిష్టిగా కృషిచేసి గెలిచామని సతీశన్ అన్నారు. మా విజయంలో పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ రమేశ్ చెన్నితాల కృషి ఎంతో ఉందని అన్నారు. వాళ్లిద్దరూ తనకు నాయకులని, వారు తనకంటే సీనియర్లు అని ఆయన చెప్పారు. అయితే పార్టీ తనకు బాధ్యతలు అప్పగించిందని, సీనియర్ నేతలతో కలిసి పాలన చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
కాగా ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఫలితాలు వెలువడి 11 రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. దాంతో ఆ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. ఎట్టకేలకు ఇవాళ ఆ ఉత్కంఠకు తెరదించుతూ సీఎం పేరును ప్రకటించారు. అంతకుముందు సీఎం పదవి కోసం సతీశన్తో పాటు కేసీ వేణుగోల్, రమేశ్ చిన్నతల తీవ్రంగా పోటీపడ్డారు.
దాంతో వారిలో ఎవరో ఒకరి పేరును ఫైనల్ చేయడానికి కాంగ్రెస్కు 11 రోజుల సమయం పట్టింది. కాగా వీడీ సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. ఆయన 1964 మే 31న జన్మించారు. 2001 నుంచి పారవూర్ నియోజకవర్గంలో వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 నుంచి ఎల్డీఎఫ్ టర్మ్ ముగిసే వరకు కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.