Sunny Joseph : సీనియర్ నాయకుడు వీడీ సతీశన్ (VD Satheesan) ను కేరళం ముఖ్యమంత్రి (Keralam CM) గా ప్రకటించడం చాలా మంచి నిర్ణయమని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు (PCC President) సన్నీ జోసెఫ్ (Sunny Joseph) అన్నారు. సతీశన్ నేతృత్వంలో కేరళం రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని ఆకాంక్షించారు. కాగా 11 రోజుల సస్పెన్స్‌కు తెరదించుతూ కేరళ సీఎంగా వీడీ సతీశన్(VD Satheesan) పేరును ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ప్రకటించింది.
ఏఐసీసీ కేరళ ఇన్చార్జి దీపా దాస్మున్సీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సతీశన్ పేరును ప్రకటించారు. దాంతో కేరళవ్యాప్తంగా ఆయన అభిమానులు సంబురాలు చేసుకున్నారు. కేరళం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు సందడిసందడిగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. వీడీ సతీశన్ ఇంట్లోనూ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సంబురాలతో పండుగ వాతావరణం నెలకొన్నది. కాగా ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది.
మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఫలితాలు వెలువడి 11 రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. దాంతో ఆ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. ఎట్టకేలకు ఇవాళ ఆ ఉత్కంఠకు తెరదించుతూ సీఎం పేరును ప్రకటించారు. అంతకుముందు సీఎం పదవి కోసం సతీశన్‌తో పాటు కేసీ వేణుగోల్, రమేశ్ చిన్నతల తీవ్రంగా పోటీపడ్డారు. దాంతో వారిలో ఎవరో ఒకరి పేరును ఫైనల్ చేయడానికి కాంగ్రెస్‌కు 11 రోజుల సమయం పట్టింది.
కాగా, వీడీ సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. ఆయన 1964 మే 31న జన్మించారు. 2001 నుంచి పారవూర్ నియోజకవర్గంలో వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 నుంచి ఎల్డీఎఫ్ టర్మ్ ముగిసే వరకు కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.