జీవితాన్ని ప్రసాదించేవాడు గురువు. ‘బతకలేక బడిపంతులు..’ అనిపించుకున్నా తమ గురుతర బాధ్యతను ఏనాడూ విస్మరించరు. అలాంటి ఉపాధ్యాయులకు కష్టం వస్తే.. ఆదుకునేవారు అరుదుగానే కనిపిస్తారు. ఈ క్రమంలో బతుకు పాఠాలు నేర్పే గురువులు వారికి వారే అండగా నిలుస్తున్నారు. కరోనా కాలంలో ఎందరో ఉపాధ్యాయులు దిక్కులేకుండా తనువు చాలించడం, వారి కుటుంబాలు రోడ్డున పడటం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వివేకానంద ఆర్యను కలచివేసింది. ఉపాధ్యాయుల జీవితాలు ఆగం కావొద్దని ‘టీచర్స్ సెల్ఫ్ కేర్ టీం’ (టీఎస్సీటీ)కు ఆయన శ్రీకారం చుట్టారు. ఒక్కో టీచర్ నుంచి రూ.16 సేకరించి ఐదేండ్లలో 400 కుటుంబాలకు ఏకంగా రూ.150 కోట్లు సాయంగా అందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చిన్నగా ప్రారంభమైన ఈ టీమ్ సేవలు ఆ రాష్ర్టాన్ని దాటుకొని ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్ వరకూ విస్తరించాయి. ఈ నేపథ్యంలో టీఎస్సీటీ వ్యవస్థాపకుడు వివేకానంద ఆర్యతో ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రత్యేక సంభాషణ.
‘ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే నెల తిరక్కుండానే బ్యాంకు అకౌంట్లో వేలల్లో జీతం పడుతుంది. కష్టాలేమీ ఉండవు’ అని అందరూ అనుకొంటారు. అయితే, కరోనా సంక్షోభంలో యూపీలో చాలామంది ఉపాధ్యాయులు ఎంతో దుర్భరమైన జీవితాలను వెళ్లదీశారు. నెలల తరబడి జీతాలు రాలేదు. కొవిడ్‌తో ఎందరో ఉపాధ్యాయులు కన్నుమూశారు. అలా చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కనీసం అంత్యక్రియలకు డబ్బులేని దుస్థితి కొందరిది. అలా మా ఊళ్లో ఇద్దరు, ముగ్గురు టీచర్లు చనిపోతే, మా నాన్నగారు తనకు తోచిన డబ్బును ఆర్థిక సాయంగా అందించారు. కొన్నిరోజులు గడిచిన తర్వాత మా నాన్నగారిని కలువడానికి ఆయన మిత్రులు వచ్చారు. తన మిత్రుడైన ఓ ఉపాధ్యాయుడు చనిపోయిన విషయాన్ని తెలుసుకొని.. ‘మాకు కూడా తెలిస్తే, మేము కూడా ఏమైనా సాయం చేసేవాళ్లం కదా’ అన్నారు. అప్పుడే నా మనసులో ఓ ఆలోచన మొదలైంది. అలాంటి సమయంలోనే యూపీ ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. 2022 తర్వాత ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు పెన్షన్ ఉండదని తీర్మానించింది. దీంతో రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని? అనిపించింది. అప్పుడే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వాల కోసం ఎదురుచూడకుండా ఏదైనా చేయాలని నిర్ణయించుకొన్నా. నా ఒక్కడి వల్ల అయితే, ఇదంతా సాధ్యంకాదు. ఓ సమూహాన్ని ఏర్పాటు చేయాలనుకొన్నా. అలా తొలుత టెలిగ్రామ్‌లో ఉపాధ్యాయుల గ్రూప్‌ను ప్రారంభించా.
క్రౌడ్ ఫండింగ్ అంటే ఎన్నో సందేహాలు ఉంటాయి. మనమిచ్చే డబ్బును నిజంగా ఆ పనికే ఖర్చు చేస్తారా? అని అందరికీ అనుమానాలు వస్తాయి. వాటన్నిటినీ నివృత్తి చేయడానికి తొలుత మేము ఓ ఐదారుగురం సభ్యులం కలిసి వలంటీర్లుగా ఏర్పడి బాధిత కుటుంబాన్ని కలిసి వారి అవసరాన్ని తెలుసుకొనే వాళ్లం. ఆధారాలు, ఫొటోలను గ్రూప్‌లో షేర్ చేసేవాళ్లం. బాధిత కుటుంబం బ్యాంకు ఖాతాను డైరెక్టుగా ఇచ్చేవాళ్లం. అలా తొలినాళ్లలోనే మా సేవల్లో పారదర్శకత అందరికీ అర్థమైంది. అలాగే, ఎవ్వరికీ ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో ఒక్కొక్కరిని రూ. 16 మాత్రమే ఇవ్వాలని అడిగేవాళ్లం. తక్కువ డబ్బు కాబట్టి ఇచ్చేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
నా స్నేహితుడు మహమ్మద్ షకీల్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. షకీల్ మరణంతో ఆ కుటుంబమంతా రోడ్డునపడే పరిస్థితి. స్నేహితుల సహకారంతో అప్పటికప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటుచేశా. ఎంతోకొంత సాయం చేయాలని విజ్ఞప్తిపూర్వకంగా అడిగా. అలా ఆ కుటుంబం కోసం తొలిసారిగా రూ.7 లక్షలను క్రౌడ్‌ఫండింగ్ ద్వారా సేకరించి అందజేశా. కలిసి పనిచేస్తే ఎంతటి కష్టాన్నయినా సులభంగా ఎదుర్కోవచ్చని అప్పుడే గుర్తించా.
ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని బట్టి సాయం ఉంటుంది. మా టెలిగ్రామ్ గ్రూప్‌లో 4 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో 3.25 లక్షల మంది యాక్టివ్‌గా ఉంటారు. గరిష్ఠంగా కోటి రూపాయల వరకూ సాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
గ్రూప్ మొదలైనప్పటి నుంచి గడిచిన ఐదేండ్లలో 316 మంది మృతుల (టీచర్లు) కుటుంబాలకు రూ.128 కోట్ల వరకూ సాయం అందించాం. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, వైద్య ఖర్చుల వంటి కేసులను కూడా కలుపుకొంటే మొత్తం 400 కుటుంబాలకు రూ.150 కోట్ల వరకూ సాయం అందించినట్టు అవుతుంది. గ్రూప్‌లో 4 లక్షల మంది నుంచి సేకరించిన డబ్బులతోనే ఇదంతా చేశాం.
కుమార్తెలకు పెండ్లి చేయలేని ఉపాధ్యాయులు కూడా ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించాం. అనారోగ్యంతో మంచానపడ్డ ఉపాధ్యాయులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు, ప్రమాదంలో గాయపడితే రూ.50 వేల చొప్పున సాయం చేస్తున్నాం. హెల్త్‌కేర్ తదితర రంగాలకు కూడా మా సేవలను విస్తరించాలని యోచిస్తున్నాం.