వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్ఠాత్మక నీట్ పరీక్ష లీకేజీ లొసుగుల మధ్య రద్దుకావటం కేంద్ర ప్రభుత్వ ఘోరవైఫల్యానికి అద్దం పడుతున్నది. ఈనెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకైనట్టు అప్పుడే ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు కొన్ని ప్రాంతాల్లో సర్క్యులేట్ అయిన ‘గెస్ పేపర్’ ఈ వివాదానికి మూలం. అందులోని 120 ప్రశ్నలు పైనల్ పేపర్లోని ప్రశ్నలే కావటం దిగ్భ్రాంతికరం. ఫలితంగా కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా దీనిపై ధర్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీంతో 22.79 లక్షల మంది అభ్యర్థుల కసరత్తు నిరర్థకం కావటం బాధాకరం. ప్రశ్నలు లీకైన మాట నిజమేనని కేంద్ర సంస్థలతో కలిసి జరిపిన ప్రాథమిక దర్యాప్తులో రుజువైందని, అందుకే పరీక్ష రద్దు చేసినట్టు ఎన్టీయే తెలిపింది. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అని చెప్పక తప్పదు. విపక్ష పాలిత రాష్ర్టాల్లో పేపర్ లీకులంటూ కిష్కింధకాండకు దిగి హంగామా చేసే బీజేపీ నాయకత్వం దేశం పరువు తీసిన నీట్ లీకులపై ఏం సమాధానం చెప్తుంది? అసలు గెస్ పేపర్ ప్రధానంగా సర్క్యులేట్ అయింది బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలోనే! డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకానికి విద్యార్థులు బలిపశువులు కావటం విచారకరం. 2013లో ప్రవేశపెట్టిన నీట్ పరీక్షను మొదటినుంచీ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2024లో పేపర్ లీకుపై తీవ్ర వివాదం చెలరేగింది. లీకేజీ వల్ల 155 మంది విద్యార్థులు ప్రత్యక్ష ప్రయోజనం పొందినట్టు సుప్రీంకోర్టు నిర్ధారించింది. చెదురుమదురు ఘటనలే తప్ప పూర్తిగా వ్యవస్థ విఫలం కాలేదంది. ఇప్పుడు పరీక్ష రద్దు ద్వారా కేంద్రం తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టయింది.
మెడికల్ సీట్లు పరిమితంగా ఉండటం, పోటీదారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పరీక్ష కఠినంగా ఉంటుంది. కేవలం 1.3 లక్షల సీట్ల కోసం 200 రెట్లకు పైగా విద్యార్థులు పోటీపడాల్సి ఉంటుంది. ఈసారి భారత్లోని 551, విదేశాల్లోని 14 నగరాల్లో 5,432 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీపట్టి, పరీక్ష రాశారు. ఇపుడు నీట్ రద్దుతో ఆ ప్రిపరేషన్ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
ప్రసవ వేదన లాంటి పరీక్ష ఉత్కంఠ గడిచిన తర్వాత మళ్లీ పరీక్ష రాయండని చెప్పటం దారుణం. హమ్మయ్య పరీక్ష అయిపోయిందని ఊరడిల్లుతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరోసారి ఉత్కంఠకు గురిచేయటం అమానుషం. పేపర్ లీకేజీ వెనుక కార్పొరేట్ కళాశాలల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎన్టీయే లోపలి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదనేది తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించి ఇటు ఎన్టీయే, అటు కేంద్రం చేతులు దులిపేసుకుంటే సరిపోదు. సక్రమంగా దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించటమే కాకుండా, సంస్థాగతమైన ప్రక్షాళన జరిపితే గానీ నీట్ పరీక్షపై చెదిరిన నమ్మకం తిరిగి కుదురుకోదు.