జోగులాంబ గద్వాల : ఉద్యాన ( Horticulture ) పంటల సాగు విస్తీర్ణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ బీఎం సంతోష్ (Collector BM Santosh ) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జిల్లా మిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఆదాయం( Farmers Income ) పెరిగేలా ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
ఆయిల్ పామ్ తోటల పెంపక విస్తీర్ణం పెంచడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సాగు కోసం రైతులను గుర్తించి అవగాహన కల్పించాలని, సబ్సిడీలు, అంతర పంటల ఆదాయం, డ్రిప్ రాయితీలు తదితర వివరాలను రైతులకు తెలియజేయాలని సూచించారు. విజయవంతమైన రైతులను రోల్ మోడల్‌గా చూపించి, బ్యాంకులు, ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం అందించాలని తెలిపారు.
జిల్లాలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూరేలా అమలు చేయాలన్నారు. పండ్ల తోటలు, కూరగాయలు, ఆధునిక సాగు పద్ధతులు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ల వంటి సదుపాయాలను సమర్థవంతంగా అందించాలన్నారు. తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడికి రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులపై ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ భాష, వ్యవసాయ అధికారి సక్రియా నాయక్, పరిశ్రమల శాఖ జీఎం రామ లింగేశ్వర్ గౌడ్,కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాసులు, జిల్లా మార్కెటింగ్ అధికారి పుషమ్మ, ఏడీఏ సంగీత లక్ష్మి, ఫారెస్ట్ అధికారి పర్వేజ్ అహ్మద్, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ మోహన్, ఉద్యానవన,వ్యవసాయ శాఖ, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.