బ్యూటీ, హెల్త్, ఫుడ్, పాలిటిక్స్.. తదితర రంగాల్లో కంటెంట్ క్రియేషన్ బాగా పెరిగింది. ఎవరికివారు వీడియోలు కట్ చేస్తున్నారు. కానీ, నేపథ్యంలో వినసొంపైన సంగీతం తోడైతేనే.. ఏ ఆడియో అయినా జనాల్లోకి వెళ్తుంది. కానీ, మ్యూజిక్ కాపీరైట్ హక్కుల కారణంగా.. ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. దీనికి పరిష్కారంగా మేఘనా మిట్టల్ ‘హూపర్ ఐడియా’ స్టార్టప్ పెట్టారు. ఇక, యూట్యూబర్స్కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాధలు తీరినట్టే. ఇందులో వేలాది మ్యూజిక్ ఫైల్స్ ఉంటాయి. వాటిని ఎలా వాడుకున్నా కాపీరైట్ సమస్య ఉండదు. అక్కడితో ఆగిపోకుండా.. డేటా ఎనాలిసిస్ ఆధారంగా ఇంటెలిజెంట్ మ్యూజిక్ రికమండేషన్స్ అందిస్తారు.
ఏ నేపథ్యానికి ఏ సంగీతం బావుంటుందో కృత్రిమమేధ ఆధారంగా సూచిస్తారు. కలారి క్యాపిటల్ అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ ఎకానమీ విలువ అక్షరాలా 105 బిలియన్ డాలర్లు. మన దేశంలో అరవై నుంచి ఎనభై లక్షలమంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారని అంచనా. 2025 నాటికి ఆ సంఖ్య కోటికి చేరుతుందని ఓ లెక్క. ఇంకేముంది, మేఘన పంట పండినట్టే.