‘భారతదేశంలో మహిళలు ప్రతిరోజూ సగటున 297 నిమిషాల సమయాన్ని ఉచిత సేవలకు కేటాయిస్తున్నారు, అదే పురుషులు కేవలం 31 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు’ అని జాతీయ నమూనా సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నా, ఆధునిక మానవ నాగరికతను నిలబెడుతున్న అత్యంత శక్తిమంతమైన ‘సహజ ఇంధనం’ ఒకటి ఉంది. అది ప్రతి ఇంటా తెల్లవారుజామునే మొదలయ్యే గృహిణి శ్రమ. ఇల్లంతా ఇంకా నిద్ర లేవకముందే వంటింట్లో
ప్రమిదలా ఆమె శ్రమ వెలుగుతుంది. కాఫీ కప్పుల సడి, క్యారేజీల హడావుడి, పిల్లల పుస్తకాల సర్దుబాటు, పెద్దల మందుల దిద్దుబాటు… ఇలా ఒక రోజంతా గడియారం ముల్లు కంటే వేగంగా ఒక ప్రాణం ఇల్లంతా పరిగెడుతూనే ఉంటుంది. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత, రేపటి రోజును ఎలా సమన్వయం
చేసుకోవాలో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకునేది ఆమే. తన పేరే ‘గృహిణి’. కానీ, ఇంత శ్రమిస్తున్న ఆమెను సమాజం అడిగే ఒకే ఒక్క ప్రశ్న… ‘నువ్వేం చేస్తుంటావు? ఇంట్లోనే కదా ఉండేది!’
ఈ ఒక్క నిర్లిప్తపు మాట ఆమె రోజంతా కార్చిన చెమటను ఒక్క క్షణంలో విలువలేనిదిగా మార్చేస్తుంది. గృహిణి చేసే పనిని కేవలం ‘బాధ్యత’ లేదా ‘ప్రేమ’ అనే రంగుల వెనుక దాచేసి, దానికి ఆర్థికపరమైన విలువ లేదనే భ్రమలో ఈ సమాజం బతుకుతున్నది. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు ఈ సాంఘిక అపహాస్యాన్ని గట్టిగా ప్రశ్నించింది. గృహిణి చేసే పని విలువను తక్కువ అంచనా వేయలేమని, ఆమె శ్రమను గనక లెక్కిస్తే నెలకు కనీసం రూ.30,000 జీతంతో సమానమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, దేశ నిర్మాణంలో గృహిణుల పాత్ర ఏమిటి? మారుతున్న జీవన విధానంలో వారికి మనం ఇవ్వాల్సిన నిజమైన గౌరవం ఏమిటి? అనే విషయాలను అందరం తప్పక ఆలోచించాలి.
భారతదేశంలో రోడ్డు ప్రమాదంలో ఒక గృహిణి చనిపోతే, ఆమె కుటుంబానికి ఇచ్చే మోటారు వాహన ప్రమాద నష్టపరిహారాన్ని లెక్కించేటప్పుడు ఆమెకు ఎలాంటి ‘ప్రత్యక్ష ఆదాయం’ లేదనే కోణంలో చాలా తక్కువ మొత్తం ఇచ్చే సంస్కృతి ఉండేది. దీనిపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. గృహిణి ఇంట్లో చేసే పని కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఒక అదృశ్య జీవన నాడి అని కోర్టు పేర్కొంది.
ఒక గృహిణి ఇంట్లో హోమ్ మేనేజర్, షెఫ్, టీచర్, కేర్ గివర్ ఇలా బహుముఖ పాత్రలు పోషిస్తుందని, ఆమె సేవలను మార్కెట్ విలువతో పోలిస్తే నెలకు కనీసం రూ.30,000 కంటే ఎక్కువే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం పరిహారానికి సంబంధించిన డబ్బుల గురించి చర్చించలేదు. దశాబ్దాలుగా వంటింటి గోడల మధ్యే మగ్గిపోతున్న స్త్రీ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి చట్టం ఇచ్చిన ఒక పెద్ద సాంఘిక గుర్తింపు ఇది.
ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఫ్యాక్టరీలు నడవాలి. కార్పొరేట్ కంపెనీలు పని చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. కానీ, వీరందరూ ప్రశాంతంగా తమ విధులను నిర్వహించగలుగుతున్నారంటే దానికి కారణం ఇంట్లో ఒక గృహిణి సర్వసన్నద్ధం చేసి పంపుతుండటమే.
పెద్ద ఆర్థికవేత్తలు దేశ స్థూల జాతీయోత్పత్తిని లెక్కిస్తారు. కానీ, దురదృష్టవశాత్తూ అందులో గృహిణి శ్రమకు చోటుండదు. ఎందుకంటే ఆమె చేసే పనికి బిల్లులు ఉండవు, రశీదులు దొరకవు. వివిధ అంతర్జాతీయ నివేదికలు, న్యాయస్థానాల విశ్లేషణల ప్రకారం… ఒకవేళ భారతదేశంలోని గృహిణుల ‘అదృశ్య శ్రమ’ను గనక ఆర్థిక విలువతో లెక్కిస్తే, అది దేశ మొత్తం జీడీపీలో ఏకంగా 15% నుంచి 17% వరకు ఉంటుందనే అంచనాలున్నాయి. అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు ఆరవ వంతు భాగం కేవలం గృహిణుల ఉచిత సేవ వల్లే నడుస్తున్నది. ఒకవేళ దేశంలోని గృహిణులందరూ ఒక్క రోజు తమ సేవలను నిలిపివేస్తే ఏమవుతుందో ఊహించుకోండి?! దేశ సాంఘిక, ఆర్థిక చట్రం మొత్తం కుప్పకూలిపోతుంది.
ఆమె పిల్లలను క్రమశిక్షణతో పెంచి దేశానికి మానవ వనరులను అందిస్తున్నది. ఇంట్లోని వృద్ధులను కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రభుత్వానికి సామాజిక భద్రత భారాన్ని తగ్గిస్తున్నది. పురుషుడు బయటికి వెళ్లి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడంటే, ఇంట్లో కుటుంబ బాధ్యతలను మోస్తున్న ఆమె త్యాగమే దానికి పునాది. అందుకే, గృహిణి శ్రమ దేశ నిర్మాణానికి ఒక బలమైన, ప్రాథమిక పునాది రాయి.
మనం చాలా సులభంగా ‘మా అమ్మే మా ఇంటి మహాలక్ష్మి’, ‘నా భార్యే నా సర్వస్వం’ అని సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతుంటాం. పండుగలకు, పుట్టినరోజులకు బహుమతులు కొనిచ్చేసి మన బాధ్యత తీరిపోయిందనుకుంటాం. కానీ, గృహిణిని గౌరవించడమంటే కేవలం పూజించడం కాదు, ఆమెను సమాన భాగస్వామిగా గుర్తించడం.
ఇప్పుడున్న ఆధునిక, ఉరుకుల పరుగుల జీవన విధానంలో గృహిణులపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు వచ్చాక, ఇంట్లోని ప్రతి చిన్న పనికి ఆమె ఒక్కతే బాధ్యురాలవుతున్నది. ఈ కాలంలో మనం చేసుకోవాల్సిన మార్పులు, ఆమెకు ఇవ్వాల్సిన నిజమైన గౌరవం ఎలా ఉండాలంటే…
శ్రమను పంచుకోవడం : వంటిల్లు లేదా గృహ నిర్వహణ కేవలం స్త్రీల బాధ్యత కాదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ఉండే పనులను కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలి. భర్త ఇంటి పనుల్లో సహాయం చేయడం, పిల్లలు తమ వస్తువులను తామే సర్దుకోవడం వంటి చిన్న చిన్న అలవాట్లు ఆమె శారీరక శ్రమను సగం తగ్గిస్తాయి.
సంపద ఆమెది కూడా… : ఇంట్లో లభించే ఆదాయం కేవలం సంపాదించే వ్యక్తిది మాత్రమే కాదు, అందులో సగం వాటా ఆ ఇంటిని నడిపే భార్యది కూడా. నెలవారీ ఖర్చుల కోసం ఆమె భర్త ముందు చేయి చాచే పరిస్థితి రాకూడదు. సుప్రీంకోర్టు చెప్పినట్లు, ఆమె శ్రమ విలువను గుర్తించి, కుటుంబ బడ్జెట్లో ఆమె సొంత అవసరాల కోసం, ఆమె ఆత్మగౌరవం కోసం ఒక నిర్ణీత మొత్తాన్ని గౌరవపూర్వకంగా కేటాయించాలి.
విశ్రాంతి పొందే హక్కు : ఉద్యోగం చేసేవారికి వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. కానీ గృహిణికి 365 రోజులూ విరామం లేని పనే. పండగ రోజైతే మరీ ఎక్కువ శ్రమ. కనీసం వారంలో ఒక రోజు లేదా ఒక పూట ఆమెకు వంట, ఇంటి పనుల నుంచి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. ఆ రోజు కుటుంబ సభ్యులే బాధ్యతను పంచుకోవాలి.
నిర్ణయాధికారంలో ప్రాధాన్యం : ఆర్థికపరమైన పెట్టుబడుల విషయాల్లోనో, ఇల్లు కొనేటప్పుడో లేదా పిల్లల ఉన్నత చదువుల విషయాల్లోనో గృహిణుల అభిప్రాయాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ‘నీకేం తెలుసు ఇంట్లో ఉండేదానివి’ అనే మూస ధోరణిని సమాజం వీడాలి.
మనం మర్చిపోతున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఏ ఆడపిల్ల కూడా కేవలం వంటింటికే పరిమితం కావాలని చదువుకోదు. పెళ్లికి ముందు ఆమెకూ ఎన్నో ఆశయాలు ఉంటాయి. డిగ్రీలు, పీజీలు చదివిన ఎంతోమంది అమ్మాయిలు కుటుంబ పరిస్థితి వల్లో, పిల్లల పెంపకం కోసమో తమ కెరీర్ను త్యాగం చేసి గృహిణులుగా ఉండిపోతున్నారు. అలాంటప్పుడు, ఆమె త్యాగాన్ని చేతగానితనంగా చూడటం ఎంతవరకు న్యాయం? తన సొంత ఆశలను, ఆశయాలను సమాధి చేసి, కుటుంబం కోసం అనుక్షణం పరితపించే ఒక స్త్రీకి మనం ఇచ్చే బహుమతి నిర్లక్ష్యమా? అందుకే, మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. అప్పుడే అది చట్టాల చిట్టాలో ఉండే ఒక తీర్పుగా మాత్రమే మిగిలిపోదు.