నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్న కథానాయికల్లో కీర్తి సురేశ్ ఒకరు. గతేడాది ఆమె నటించిన ‘రివాల్వర్ రీటా’, ‘ఉప్పు కప్పురంబు’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినప్పటికీ, నటిగా ఆమె క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం వివిధ భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉంటున్న కీర్తి తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్దన్’ చిత్రంలో నటిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ.. ‘మహానటి’ తరహా శక్తిమంతమైన పాత్రల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేసింది. కీర్తి కెరీర్లో ‘మహానటి’ ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది. దివంగత నటి సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు మొదట ఎంతో ఆందోళన చెందినట్లు ఆమె గుర్తు చేసుకున్నది.
కెరీర్ ఆరంభంలోనే అంతటి గొప్ప నటి పాత్రను పోషించడం సామాన్యమైన విషయం కాదని, ఆ సమయంలో తాను ఒక సాధారణ పాత్ర చేయడం లేదనే సృ్పహ తనకు ఉందని చెప్పుకొచ్చింది. ఆ సినిమా సాధించిన అఖండ విజయం తనను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో ఆ స్థాయి భారీ విజయం దకలేదని అంగీకరిస్తూనే మళ్లీ అలాంటి సోప్ ఉన్న పాత్రల కోసమే తన అన్వేషణ సాగుతున్నదని మనసులోని మాటను బయటపెట్టింది.