న్యూఢిల్లీ : గృహిణులు జాతి నిర్మాతలని.. వారందించే గృహ సంరక్షణ సేవలను ప్రత్యేక అంశంగా పరిగణించి ఆ మేరకు మోటర్ ప్రమాద కేసుల్లో పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్ట్ గురువారం కీలక తీర్పు ఇచ్చింది. గృహిణులు అందించే సేవలు ఆర్థిక, సామాజిక విలువను కలిగి ఉంటాయని ధర్మాసనం తెలిపింది. అలాంటి గృహిణులను ప్రమాదంలో కోల్పోతే వారి నెలవారీ ఆదాయాన్ని కనిష్ఠంగా రూ.30 వేలుగా లెక్కించాలని కోర్టు నిర్ధారించింది. ఓ మోటర్ ప్రమాద కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఇంటి నిర్వహణలో గృహిణులు తమ వంతు సహకారం అందిస్తారు. వాళ్లు జాతి నిర్మాతలు. వాళ్ల సహకారాన్ని మీరెలా అంచనా వేస్తారు, దాన్ని ఆదాయ వనరుగా మీరెలా మారుస్తారు?
‘గృహిణి’ అనే పదం ఇకపై జాతి నిర్మాతకు సంక్షిప్త రూపం’ అని ధర్మాసనం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అలాంటి గృహిణి ప్రమాదంలో చనిపోతే ఆ నష్టానికి పరిహారాన్ని నిర్ణయించేటప్పుడు ఆమె సేవలు స్వతంత్ర గుర్తింపునకు అర్హమైనవని కోర్టు తెలిపింది. అలాంటి గృహిణులను కోల్పోతే వారు చేసే సేవలకు కనిష్ఠంగా నెలకు లభించే ఆదాయం రూ.30 వేలుగా పరిగణించాలని జస్టిస్ సంజయ్ కరోల్ అన్నారు. ప్రణయ్ సేథి కేసులో తాము ఇచ్చిన నష్ట పరిహార అంశాలు కాకుండా ‘గృహ సంరక్షణ సేవలు’ కోల్పోవడం పరిహారం పొందడానికి అదనపు కారణమని కోర్టు స్పష్టతనిచ్చింది. తాజా తీర్పుపై తాము అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు మార్గ నిర్దేశకాలు జారీ చేశామంది.