హైదరాబాద్, జనవరి 16 (సమస్తే తెలంగాణ): వరంగల్ నేషనల్ హైవేపై రాయగిరి క్రాస్‌రోడ్స్ వరకు ఉన్న ‘మల్టీలేయర్ ప్లాంటేషన్ గ్రీనరీని పెంబర్తి వరకు పొడిగించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. దాదాపు 26 కిలోమీటర్ల మేరకు రూ.5 కోట్ల వ్యయంతో ఈ పనులు చేసేందుకు సన్నద్ధం అవుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అమలవుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు, వరంగల్ జాతీయ రహదారిపై హెచ్ఎండీఏ పెంచిన ‘మల్టీలేయర్ ప్లాంటేషన్’ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో వరంగల్ రహదారిపై పచ్చదనం పెంపుదలకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. అయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పురపాలకశాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏకు ఆ పనులు అప్పగించారు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర రూ.5.5 కోట్ల వ్యయంతో రోడ్డు మధ్యన సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ ఆకుపచ్చని అందాలు ఇతర రాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా మారాయి. ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారి ఏకే మౌర్య ఈ పచ్చదనాన్ని అధ్యయనం చేసి వెళ్లారు.