కేప్‌టౌన్ : హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలిచ్చాయి. లెనకపవిర్ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్ఐవీ నుంచి కాపాడవచ్చునని స్పష్టమైంది. రోజువారీ మాత్రల రూపంలో రెండు ఇతర ఔషధాల కన్నా లెనకపవిర్ ఇంజెక్షన్ మెరుగైనదా? కాదా? అనే అంశాన్ని ఈ పరీక్షల్లో విశ్లేషించారు. ఈ మూడు ఔషధాలు ప్రీ-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (పీఆర్‌ఈపీ) డ్రగ్స్ అని పరిశోధకులు తెలిపారు. 2,134 మంది యువతులు లెనకపవిర్ ఇంజెక్షన్‌ను తీసుకోగా, వీరిలో ఎవరికీ హెచ్ఐవీ సోకలేదు. నూటికి నూరు శాతం సత్ఫలితాలు వచ్చాయి. ట్రువడ (ఎఫ్/టీడీఎఫ్) ఔషధాన్ని 1,068 మంది యువతులు తీసుకోగా, వీరిలో 16 మందికి హెచ్ఐవీ వైరస్ సోకింది. ఈ ఇంజెక్షన్‌ను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు గిలీడ్ సైన్సెస్ ఓ ప్రకటనలో తెలిపింది.