e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్‌

ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల : ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 2021-22 యాసంగి పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో పని తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుందన్నారు. రాష్ట్రం మరింత స్వయం సమృద్ధి సాధించాలి అంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను వ్యవసాయ విస్తర్ణాధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రైతు సమస్యలపై సీఎంకు అవగాహన

రైతుబిడ్డగా, రైతుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతు సమస్యలపై అవగాహన ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దీంతోనే ఏ రాష్ట్రంలోని విధంగా రైతుబంధు పథకం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే కుటుంబం సంక్షోభంలో చిక్కుకుపోకుండా ఉండేందుకు రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా మారిందన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు చేయడం ద్వారా రైతులకు లాభసాటిగా ఉటుందని, తక్కువ పనితో ఎక్కువ ఫలితం పొందడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం మరింత స్వయం సమృద్ధి సాధించేందుకు పంటలు సాగు చేసేలా రైతులను ప్రజాప్రతినిధులు వ్యవసాయశాఖ అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు.

దేశానికి ధాన్య భాండాగారం తెలంగాణ

- Advertisement -

ధాన్యాన్ని పండించడంలో తెలంగాణ యావత్ భారతదేశానికే భాండాగారంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. 3కోట్ల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. గత సంవత్సరం యాసంగి కాలంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు చేసి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే గతేడాది కంటే ఈ సంవత్సరం అదనంగా లక్ష ఎకరాలు ధాన్యం పండిందన్నారు. కేంద్రం దొడ్డు బియ్యం కొనుగోలు చేయమని చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. రైతులు వచ్చే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని, ఉచిత కరెంటు, రైతుబీమా, రైతుబంధు, రుణమాపీ అందిస్తూ బాసటగా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9లక్షలకు పైచీలుకు అన్నదాతలకు రుణమాఫీ చేసినట్లు ప్రకటించారు.

భూగర్భ జలాలు భారీగా పెరిగినయ్‌

ఒకప్పుడు కరువు ప్రాంతమైన సిరిసిల్లలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎగువ మానేరు, అన్నపూర్ణ, రాజరాజేశ్వర జలాశయాల ద్వారా జిల్లాలో భూగర్భ జలాల సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. మల్కపేట జలాశయం నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాల సామర్థ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాల్లో 666 చెరువులు ఉన్నాయని, ఇందులో 85 శాతం చెరువులు ఎప్పటికీ నీటితో కళకళలాడేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో తెలంగాణలో హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, గులాబీ విప్లవాలు ఆవిష్కృతమయ్యాయన్నారు. 4,72,329 ఎకరాలు మన జిల్లా భూభాగం కాగా, అందులో సాగుకు అనుగుణంగా ఉన్నది 2,48 లక్షల ఎకరాలని తెలిపారు.

నేనూ ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తా

ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేటీఆర్‌ తెలిపారు. జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో సగటున వంద ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా ప్రతీ వ్యవసాయ విస్తరణ అధికారి రైతులను ప్రోత్సహించాలని, రైతు వేదికల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సంయమనం, ఓపికతో రైతులకు ఆయిల్ పామ్ పంట సాగుతో వచ్చే లాభాలను వివరించాలని మంత్రి సూచించారు. వేరుశెనగ, కందులు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు.

జిల్లా నుంచి రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు తీసుకెళ్లామని, అక్కడ ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న తీరును స్వయంగా అందరూ పరిశీలించవచ్చన్నారు. ప్రజాప్రతినిధులు ముందుగా బాధ్యత తీసుకొని సొంతంగా వ్యవసాయక్షేత్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మోహినికుంట గ్రామంలో పదిహేను ఎకరాల స్థలం తీసుకుని తాను కూడా స్వయంగా ఆయిల్ పామ్ పంటను చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలాఖరు నాటికి 57 క్లస్టర్ల పరిధిలో పంటల సాగుపై సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధికారులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండాలని సూచించారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ మాదిరిగా జిల్లాలో మరొక ఐదు.. కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుగుణంగా రైతులు ఏ విధమైన పంటలు సాగు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని రాబోయే 15 రోజుల్లోగా జిల్లా యంత్రాంగానికి తెలపాలని, తద్వారా విత్తనాలను సమకూర్చుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు.

సమావేశంలో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్ఓ శ్రీనివాస రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement