సుల్తాన్‌బజార్, ఆగస్టు 31: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల వివక్ష, బీహార్‌లో విద్యార్థుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రధాన కార్యాలయం గోడపై కాషాయం రంగుకు నల్ల రంగు రుద్దారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ హుటాహుటిన కాషాయం రంగును గోడకు రుద్దారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ఖర్గే పాల్గొన్న ఓ బహిరంగ సభా ప్రాంగణాన్ని బీజేపీ నేతలు శుద్ధి చేశారని, బీహార్‌లో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని విమర్శించారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి, మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
గాంధీభవన్‌పై గుడ్లతో దాడి
యూత్ కాంగ్రెస్ కార్యకర్తల చర్యకు ప్రతిచర్యగా బీజేపీ శ్రేణులు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా గాంధీభవన్ వైపు వారు వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరు బీజేపీ నాయకులు గాంధీభవన్‌లోకి కోడిగుడ్లు విసిరారు. ఇరు పార్టీల పరస్పర దాడులతో నాంపల్లి పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.