న్యూఢిల్లీ, ఆగస్టు 31: సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం తన నెలవారీ అంచనాలో పేర్కొంది. 1901 సంవత్సరం తర్వాత 2026 ఆగస్టులోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని, ఆ నెలలో సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ నెలలో వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 91 శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది.
అలాగే సెప్టెంబర్ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతల నెలవారీ సగటు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంపై ప్రస్తుతం బలమైన ఎల్ నినో పరిస్థితులు నెలకొన్నాయని, మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్ఎస్టీ) సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడానికి ముఖ్య కారణం ఎల్ నినో పరిస్థితులేనని ఐఎండీ తెలిపింది.