హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆడపిల్లల భద్రత గాలిలో దీపంలా మారిందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆమె మాట్లాడుతూ గురుకులంలో చదువుకున్న పేదింటి నర్స్ హత్య, ఖమ్మంలో మైనర్ బాలికపై దారుణం, ఎంఐఎం ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణలే ఇందుకు నిదర్శనమని ఆవేదన వ్యక్తంచేశారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పటివరకు మహిళల భద్రతపై ఒకసారి కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో వైభవంగా పనిచేసిన షీ టీమ్స్ నేడు నిర్వీర్యమయ్యాయని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
పేట్రేగిపోతున్న ఉన్మాదులు
బీఆర్ఎస్ నేత షకీలారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు పేట్రేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు నెలల పసికందు నుంచి 60 ఏండ్ల వృద్ధుల వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయిందని, రోజూ ఏదో ఒక మూల లైంగికదాడులు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని దుయ్యబట్టారు. పాలన వదిలేసి వ్యాపార లావాదేవీలపైనే ధ్యాస పెట్టిన ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
పోక్సో నేరస్తులకు అండగా సీఎం
బీఆర్ఎస్ నేత కే మమత మాట్లాడుతూ పోక్సో కేసుల నిందితులు, నేరస్తులను స్వయంగా ముఖ్యమంత్రే కాపాడుతున్నారనే భావన సమాజంలో ఏర్పడిందని అన్నారు. నేరస్తులకు అభయం లభించడం వల్లే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం మహిళల కన్నీటిలో కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారి భద్రతను నిర్ధారించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపేది లేదని మమత స్పష్టంచేశారు.