టెల్ అవీవ్, అక్టోబర్ 8: లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ మధ్య పోరు ఉధృతమవుతున్నది. ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై మంగళవారం హెజ్బొల్లా విరుచుకుపడింది. 100కుపైగా రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌కు రక్షణ కవచంలా నిలుస్తున్న ఐరన్‌డోమ్‌ను దాటుకుని ఇవి హైఫాపై పడినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. అయితే మెజార్టీ రాకెట్లను ఐరన్‌డోమ్‌తో కూల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. కొన్ని రాకెట్లు హైఫా శివారులోని నివాస ప్రాంతాలపై పడినట్టు పేర్కొన్నది. కనీసం ఐదు రాకెట్లు నగరంపై పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు, హెజ్బొల్లా దాడులకు ప్రతిగా బీరుట్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీరుట్లో తమ ఇంటిలిజెన్స్ విభాగం సూచనలతో జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం అధిపతి, లాజిస్టిక్స్ యూనిట్ హెడ్ సొహైల్ హుస్సేన్ హుస్సేనీ హతమైనట్టు ఐడీఎఫ్ అధికారులు తెలిపారు. దీనిపై హెజ్బొల్లా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
హెజ్బొల్లా తాత్కాలిక చీఫ్ ఖాసిం
ఇజ్రాయెల్‌తో పోరులో తమ అధినేత హసన్ నస్రల్లాను కోల్పోయిన అనంతరం ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాలో ఇప్పటివరకు అంతగా ప్రాచుర్యం పొందని నేతలు వెలుగులోకి వస్తున్నారు. నస్రల్లా మృతితో ప్రస్తుతం హెజ్బొల్లాకు తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్న షేక్ నయీమ్ ఖాసింపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మంగళవారం నయీమ్ టెలివిజన్‌లో మాట్లాడుతూ తమకు తిరుగులేని పోరాటతత్వం ఉందని, తమతో ఇజ్రాయెల్ దీర్ఘకాలం పోరును సాగించలేదని అన్నారు.
ఎవరీ ఖాసిం?
ఖాసింకు నస్రల్లా అంతటి వాగ్ధాటి లేదు. అయితే గతంలో తనను హత్య చేస్తారన్న భయంతో నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లి కేవలం టెలివిజన్ ప్రసంగాలకే పరిమితమైనప్పుడు ఖాసిం పార్టీ సభలు, సమావేశాలు చురుకుగా నిర్వహించడమే కాక, విదేశీ చానళ్లకు ముమ్మరంగా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. ఇప్పటికే ఆయనను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. కాగా, బహిరంగ ప్రకటనల విషయంలో నస్రల్లా కంటే ఖాసింను చాలా మంది అభిమానించే వారని సంస్థలోని సీనియర్ సభ్యుడు మోహనడ్ హగే అలీ తెలిపాడు. దక్షిణ లెబనాన్‌లోని క్వాఫర్ ఫిలా అనే పట్టణంలో జన్మించిన ఖాసిం లెబనాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ చదివారు. ఈ సంస్థలో చేరకముందు చాలా ఏండ్లు కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశాడు.
సఫీద్దీన్ మృతి?
వారం క్రితం జరిగిన దాడిలో నస్రల్లా వారసుడు సఫీద్దీన్ మరణించి ఉండవచ్చునని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలెంట్ మంగళవారం తెలిపారు.‘ ఇప్పుడు హెజ్బొల్లా నాయకుడు లేని సంస్థ’ అని ఆయన వ్యాఖ్యానించారు.